కీర్తి సురేష్ (Keerthy Suresh), సుహాస్ (Suhas) ప్రధాన పాత్రల్లో “నిన్నిలా నిన్నిలా” ఫేమ్ అని ఐవి శశి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “ఉప్పు కప్పురంబు” (Uppu Kappurambu). అమెజాన్ ఒరిజినల్ ఫిలింగా తెరకెక్కిన ఈ చిత్రం కాన్సెప్ట్ & ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పాయి. స్మశానానికి “హౌస్ ఫుల్” బోర్డ్ పెడితే ఆ ఊరి పరిస్థితి ఏంటి అనేది కోర్ పాయింట్ గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సెటైరికల్ హ్యూమర్ చిత్రం ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలిగిందో చూద్దాం..!!
కథ: తండ్రి మరణంతో ఊహించని విధంగా ఊరిపెద్దగా మారిపోతుంది అపూర్వ (కీర్తి సురేష్). ఆమెకు ఆ ఊర్లో ఎదురైన మొదటి సమస్య స్మశానంలో కేవలం నాలుగు సమాధులు తవ్వే స్థలం మాత్రమే మిగలడం. దాంతో.. ఊర్లో ఉన్నవాళ్లందరికీ ఆ 4 సమాధి స్థలాలు ఎలా సర్దాలా? అనే కంగారులో అపూర్వ ఏం చేసింది? ఆమెకు చిన్న (సుహాస్) ఎలా సహాయపడ్డాడు? అనేది “ఉప్పు కప్పురంబు” (Uppu Kappurambu) కథాంశం.
నటీనటుల పనితీరు: సుహాస్ మరోసారి సహజమైన నటనతో చిన్నా పాత్రకు ప్రాణం పోశాడు. మొదట్లో ఏదో అమాయక మహారాజులా కనిపించే అతడి పాత్ర.. తల్లి మరణంతో రూపాంతరం చెందే విధానం కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ మరియు మోహన్ బాబు కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించే సీన్ లో సుహాస్ తన సత్తా చాటుకున్నాడు.
ఇకపోతే.. కీర్తిసురేష్ మొదటిసారి బాడీ లాంగ్వేజ్ తో కామెడీ పండించాలని ప్రయత్నించి తాను కష్టపడి, ప్రేక్షకుల్ని కాస్త ఇబ్బందిపెట్టింది. ఈ తరహా నటన ఆమెను కొత్త కావడం, చార్లీ చాప్లిన్ యాక్ట్ తరహా చాకచక్యం కొరవడడంతో అపూర్వలోని అమాయకత్వాన్ని, బేలతనాన్ని ప్రదర్శించడంలో కాస్త తడబడింది. అయితే.. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ మాత్రం సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి.
శత్రు రొటీన్ కి భిన్నంగా కామెడీ పండించే ప్రయత్నం చేశాడు. బాబు మోహన్ ను చాన్నాళ్ల తర్వాత మంచి బరువైన పాత్రలో చూసాం. అయితే.. ఆయనకి మరిన్ని డైలాగ్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. దువ్వాసి మోహన్ కి మరెవరో డబ్బింగ్ చెప్పడం కాస్త మైనస్ అయ్యింది. తింగరోడిగా రవితేజ నటన బాగుంది, ముఖ్యంగా చిన్నా తల్లి చనిపోయిన విషయాన్ని చెప్పే సన్నివేశంలో చక్కని నటనతో విశేషంగా ఆకట్టుకుని, ఆ సన్నివేశం పండడంలో కీలకపాత్ర పోషించాడు.
శుభలేఖ సుధాకర్ కనిపించేది కాసిన్ని సన్నివేశాల్లోనే అయినప్పటికీ.. తనదైన మార్క్ నటనతో మెప్పించారు.
సాంకేతికవర్గం పనితీరు: “సినిమా బండి, శుభం” ఫేమ్ వసంత్ ఈ సినిమాకి కూడా కథ అందించారు. అసలు ఇలాంటి సమస్య ఒకటి ఉంటుందా? అని అందరూ ఆలోచించే స్థాయిలో కథ కోర్ పాయింట్ ఉండడం అనేది ప్లస్ అయితే.. ఆ సమస్యను ఎస్టాబ్లిష్ చేసిన విధానం సరిగా వర్కవుట్ అవ్వలేదు. అలాగే.. దర్శకుడు అని, ఊరు ప్రజల వ్యక్తిత్వాన్ని ఇంకాస్త చక్కగా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే.. వాళ్లు పండించే స్లాప్ స్టిక్ కామెడీని ప్రేక్షకుడు కూడా ఆస్వాదించేవాడు. అది లోపించడంతో తొలి భాగం మొత్తం పాత్రల వ్యవహారశైలిని అర్థం చేసుకోవడానికే సరిపోయింది. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి అనవసరమైన సన్నివేశాలతో సాగదీయకుండా కోర్ పాయింట్ ను బాగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా.. మనుషుల ఆలోచనాధోరణి ఎలా ఉంటుంది?, సాటి మనిషికి సహాయం చేయడానికి ముందుకురాని మనిషి, తన చావు కోసం కూడా ఎంతలా పరితపిస్తాడు? వంటి విషయాలను వ్యంగ్యంగా ప్రశ్నించిన విధానం బాగుంది. అలాగే.. క్లైమాక్స్ లో సుహాస్ పాత్రతో చెప్పిన నీతికథ కూడా ఆకట్టుకుంటుంది. ఓవరాల్ గా.. దర్శకుడిగా అని ఫర్వాలేదనిపించుకున్నాడనే చెప్పాలి.
విశ్లేషణ: కొన్ని సినిమాలు నవ్విస్తూనే ఆలోచింపజేస్తాయి. ఇంకొన్ని సినిమాలు ఆలోచింపజేస్తూ, మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి. ఈ రెండో తరహా సినిమా “ఉప్పు కప్పురంబు”. మనిషి ఆలోచించాల్సింది సాటి మనిషికి ఇబ్బందివచ్చినప్పుడు ఎలా సహాయపడాలా? అనే కానీ.. ఎంతసేపు స్వయం లాభం కోసం ఆలోచిస్తే ఏమొస్తుంది? అనే ప్రశ్నను లేవనెత్తిన విధానం ప్రశంసనీయం. అయితే.. పైన పేర్కొన్నట్లు స్లాప్ స్టిక్ కామెడీ అనేది ఇంకాస్త ప్రాపర్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే అందరూ నవ్వుకునేవారు. ఇకపోతే.. ఇంతటి భారీ క్యాస్టింగ్ తో రీజనల్ సినిమాలు, మరీ ముఖ్యంగా తెలుగు సినిమాలు నిర్మిస్తున్న అమెజాన్ సంస్థను కూడా మెచ్చుకోవాలి. కోర్ పాయింట్ ను ఇంకాస్త ఎమోషనల్ గా డ్రైవ్ చేసి, కామెడీని అందరూ ఆస్వాదించేలా జాగ్రత్త తీసుకుని ఉంటే “ఉప్పు కప్పురంబు” ఓ మంచి సినిమాగా మిగిలేది.
ఫోకస్ పాయింట్: ఆరడుగుల నేల కోసం మనిషి పడే ఆరాటంబు!
రేటింగ్: 2.5/5