అతిలోక సుందరి శ్రీదేవి

ఎందరికో కలల రాణి శ్రీదేవి. డైరక్టర్ రామ్ గోపాల్ వర్మకు సౌందర్య దేవత. ఎంత బాగా నటిస్తున్నా ప్రేక్షకులందరూ ఆమె అందాన్ని చూసేందుకే కళ్లను ఉపయోగించారు. అందుకే శ్రీదేవిని అతిలోక సుందరి అంటే జేజేలు పలికారు. ఈ సుందరి మాతృభాష తమిళం అయినా తెలుగు, హిందీ చిత్ర సీమలో ముప్పై ఏళ్ల పాటు అగ్ర తార వెలిగారు. ప్రస్తుతం ఇల్లాలిగా, ఇద్దరు పిల్లల తల్లిగా తన బాధ్యతను నెరవేరుస్తున్నశ్రీదేవి నేడు (ఆగస్టు 13) పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్బంగా ఆమె గురించి ఇంట్రస్టింగ్ సంగతులు..

శ్రీ దేవికి ఆమె తల్లి దండ్రులు పెట్టిన పేరు “శ్రీ అమ్మ అయ్యప్పన్”. తండ్రి అయ్యప్పన్ చెన్నై వాసి. తల్లి రాజేశ్వరి తెలుగు అమ్మాయి. వీరు తమిళనాడు లోని శివకాశిలో శ్రీదేవికి జన్మనిచ్చారు.

తన నాలుగో ఏట శ్రీ దేవి కెమెరా ముందుకు వచ్చారు. “తుణైవన్” అనే తమిళ సినిమాలో బాల మురుగన్ గా నటించారు.

తెలుగులో 1972 లో వచ్చిన “బడి పంతులు” సినిమాలో శ్రీదేవి నందమూరి తారక రామారావుకి మనవరాలిగా నటించింది. హీరోయిన్ గా ఎదిగిన తర్వాత అదే హీరో తో డ్యూయట్లు పాడింది.

“మూండ్రు ముడుచు” అనే తమిళ సినిమాలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్ కి శ్రీదేవి సవతి తల్లిగా నటించింది. అప్పుడు ఆమె వయసు 13 ఏళ్లు మాత్రమే.

అందాల నటికి హాలీవుడ్ నుంచి అవకాశం వచ్చింది. ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్ బర్గ్ తన జురాసిక్ పార్క్ సినిమాలో చిన్న రోల్ చేయమని అడిగారు. అప్పుడు శ్రీదేవి హిందీ సినిమాలో బిజీగా ఉండడంతో తిరస్కరించారు.

బాలీవుడ్ లోకి అడుగు పెట్టినప్పుడు శ్రీదేవికి హిందీ సరిగా రాదు. అందుకే ఇతరులు డబ్బింగ్ చెప్పేవారు. తొలి సారి చాందిని సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పారు.

శ్రీదేవి బాలనటి స్థాయి నుంచి కన్నడలో 6, మలయాళంలో 26, హిందీలో 70, తమిళంలో 71, తెలుగులో 81 సినిమాలు చేశారు. తెలుగులో ఆమె ఆఖరి చిత్రం ఎస్.పీ. పరుశరామ్.

శ్రీదేవి ఐదు సార్లు ఉత్తమ నటిగా ఫిలిం ఫెర్ అవార్డులు అందుకున్నారు.

2013 లో భారత ప్రభుత్వం శ్రీదేవిని “పద్మశ్రీ” పురస్కారం తో సత్కరించింది.

శ్రీదేవి నిర్మాత బోణీ కపూర్ ని 1996 లో పెళ్లి చేసుకుంది. వీరికి జాన్వి, ఖుషి అనే ఇద్దరు అమ్మాయిలున్నారు.

పెళ్లి చేసుకున్న తర్వాత శ్రీదేవి సినిమాలకు దూరమయ్యారు. 2012లో ఇంగ్లిష్ వింగ్లిష్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు. తమిళ సినిమా పులి లోను నటించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus