కథ : గోపాల్ అలియాస్ రావుగోపాల్రావు (దుల్కర్ సల్మాన్) టైమ్స్ పేపర్ లో ఓ రిపోర్టర్. అయితే.. న్యూస్ రాయడం కంటే తనకు ఇష్టమైన స్కెచ్ లు గీయడానికే ఎక్కువ ఇష్టపడతాడు. ఒక వర్షం కురిసిన రాత్రి అనుకోని రీతిలో సావిత్రి (నిత్యామీనన్)ను కలుస్తాడు. మొదటిచూపులోనే ప్రేమించి ఆమె కోసం వెతకడం మొదలెడతాడు. తీరా ఆమెని కలుసుకొన్నాక సావిత్రి తన చిన్నప్పటి స్కూల్ మేట్ అని తెలుసుకొంటాడు. అయితే.. అప్పటికే ఆమెకు రాహుల్ (రాహుల్ మాధవ్) అనే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అయినా కూడా సావిత్రి ప్రేమను దక్కించుకోవాలనుకొంటాడు గోపాల్. మరి గోపాల్ ప్రేమ గెలిచిందా? నిత్యామీనన్ ను ప్రేమించడానికి ప్రయత్నించిన “100 డేస్ ఆఫ్ లవ్”లో గోపాల్ సాధించింది ఏమిటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిన విషయం.
నటీనటుల పనితీరు : “ఓకే బంగారం”తో సూపర్ సక్సెస్ పెయిర్ అనిపించుకొన్న దుల్కర్-నిత్య మరోమారు అదే స్థాయి కెమిస్ట్రీతో అలరించారు. జీవితంలో ఏదైనా సాధించాలనుకొనే వ్యక్తిగా దుల్కర్ అద్భుతంగా నటించాడు. అలాగే.. అతడికి పెయిర్ గా హైట్ తప్ప అన్ని రకాలుగానూ నిత్య ఒదిగిపోయింది. “ప్రేమదేశం” ఫేమ్ వినీత్ ను ఈ చిత్రంలో నిత్యామీనెన్ తండ్రిగా సరికొత్తగా చూడడం ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. అలాగే హీరో ఫ్రెండ్ గా గుమ్మడి పాత్రలో శేఖర్ మీనన్ తనదైన కామెడీ టైమింగ్ తో ఉల్లాసపరిచాడు. మిగతా నటీనటులందరూ తమకు లభించిన పాత్రలకు పూర్తి స్థాయిలో న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు : గోవింద్ మేనన్ అందించిన బాణీలకంటే.. బిజిబల్ సమకూర్చిన నేపధ్య సంగీతానికే ఎక్కువ మార్కులు పడ్డాయి. ప్రతి సన్నివేశంలోని ఎమోషన్ ను తన నేపధ్య సంగీతంతో ప్రేక్షకులు ఓన్ చేసుకొనేలా చేశాడు బిజిబల్. ప్రతీష్ శర్మ కెమెరా వర్క్ ఈ సినిమాకి మరో హైలైట్. ముఖ్యంగా రోమాంటిక్ సీన్స్ కు వాడిన గ్రే టింట్ అండ్ నైట్ ఎఫెక్ట్ కోసం వాడిన యెల్లో మిక్స్డ్ టింట్ సన్నివేశంలోని ఎమోషన్ ను ఎలివేట్ చేయడంలో కీలకపాత్ర పోషించాయి.
స్వచ్చమైన సంగీతానికి కృష్ణచైతన్య అందించిన హృద్యమైన సాహిత్యం తొడవ్వడంతో.. ప్రతి పాట వినసోంపుగా ఉంటుంది. శశాంక్ వెన్నెలకంటి సంభాషణలు బాగున్నప్పటికీ.. డబ్బింగ్ సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన చాలా చోట్ల లిప్ సింక్ ఉండదు. అందువల్ల కాస్త ఇబ్బందిపడాల్సి వస్తుంది.
జెనుసే మహమ్మద్ రాసుకొన్న కథ చాలా పాతది. అయితే.. ఆ కథను నడిపించిన కథనమే ఈ చిత్రానికి ఆయువుపట్టుగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్ లోనూ ఫ్రెష్ నెస్ కనిపిస్తుంది. ముఖ్యంగా.. బాత్ రూమ్ లో దుల్కర్-నిత్యల నడుమ సాగే సన్నివేశం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అలాగే.. ఇద్దరి మధ్య కెమిస్ట్రీని కూడా అద్భుతంగా పండించారు. కథకుడిగా కాస్త తడబడినా దర్శకుడిగా మాత్రం వందకి వంద మార్కులు సంపాదించుకొన్నాడు మహమ్మద్.
విశ్లేషణ : “స్వచ్చమైన ప్రేమకథ” అనే పదం వినడమే తప్పితే తెలుగు తెరపై చూసి చాలా రోజులయ్యింది. తెలుగులో గతేడాది వచ్చిన “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” మినహా మరో సినిమా పేరు కూడా తట్టని స్థాయిలో మన తాజా చిత్రాలున్నాయి. అలాంటి రొట్ట సినిమాలు చూసి చూసి బేజారెత్తిన పోయిన సినీ ప్రేమికులకు కాస్త సాంత్వన చేకూర్చే చిత్రం “100 డేస్ ఆఫ్ లవ్”.
సినిమాలో రొమాన్స్ ఉంటుంది.. కానీ హీరోహీరోయిన్ల నడుమ ముద్దు-శృంగార సన్నివేశాలు ఉండవు. సినిమాలో ప్రేమ ఉంటుంది.. అయితే ఆ ప్రేమ కోసం పెద్ద పోరాటాలు, తగాదాలు, కొట్లాటలు ఉండవు. ప్రేమికుల మధ్య అలకలు ఉంటాయి.. కానీ అవి ఉచ్చ స్థాయిలో కాక సగటు ప్రేక్షకుడు సదరు పాత్రతో తనను తాను అనునయించుకొనే విధంగా ఉండడం విశేషం.
మొత్తానికి.. “100 డేస్ ఆఫ్ లవ్” ఒక స్వచ్చమైన, ఉల్లాసభరితమైన ప్రేమాయణం. అయితే.. అన్నివర్గాల వారికి నచ్చుతుందని చెప్పలేం కానీ, సున్నిత మనస్కులకు, ప్రేమభావాలు మెండుగా కలిగిన కుర్రకారుకు విశేషంగా నచ్చే అవకాశాలు లేకపోలేదు!