1945 Review: ‘1945’ సినిమా రివ్యూ & రేటింగ్!

  • January 7, 2022 / 08:03 PM IST

‘బాహుబ‌లి’ త‌ర్వాత మన భల్లాల దేవుడు దగ్గుబాటి రానా చాలా విభిన్న కథా చిత్రాల్ని ఎంపిక చేసుకున్నాడు.అన్నీ చాలా వరకు బిగ్ బడ్జెట్ మూవీసే కావడం మరో విశేషం. అందులో ‘1945’ కూడా ఒకటి. పీరియాడిక్ క‌థ‌తో అదీ బ్రిటీష్ కాలం నాటి పరిస్థితుల నేపథంలో సెట్స్‌ పైకి వెళ్ళిన సినిమా ఇది.తర్వాత రకరకాల కారణాలు,వివాదాల కారణంగా ఈ చిత్రం షూటింగ్ మధ్యలో ఆగిపోయింది. అయితే షూటింగ్ జరిపినంత వరకు ఎడిటింగ్ చేసి.. వివాదాల్ని సర్దుమణిగేలా చేసి..

నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ఎటువంటి ప్రమోషన్ల హంగామా లేకుండానే ‘1945’ ని థియేటర్లలోకి తెచ్చారు. రానా అయితే ఈ చిత్రంతో నాకు సంబంధం లేదని ఓ సందర్భంలో చెప్పకనే చెప్పాడు. మరి ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : బ్రిటీష్ వాళ్ళు భారతీయులను తమ పాలనతో అణగదొక్కుతూ ఆధిపత్యం చలాయించుకోవాలని పరితపిస్తున్న 1945 వ సంవత్సరంలో వారికి వ్యతిరేకంగా నేతాజి సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించడానికి కంకణం కట్టుకుంటాడు. అదే సమయంలో తన ఫ్యామిలీ బిజినెస్ లను చూసుకొనేందుకు ఆది (రానా) బర్మాకి వెళ్తాడు. బ్రిటీష్ ప్రభుత్వంలో పనిచేసే తహసీల్దార్‌ (నాజర్)‌ కూతురు (రెజీనా)తో ఇతనికి నిశ్చితార్థం కూడా జరుగుతుంది.

అదే సమయంలో.. మరోపక్క బ్రిటీష్ వారు తమ పాలనతో భారతీయులను ఇబ్బంది పెడుతుండడం ఆదికి నచ్చదు.ఈ క్రమంలో ఆది తీసుకున్న స్టెప్ ఏంటి? బ్రిటీష్ వారి పై అతను ఎలా తిరగబడ్డాడు? చివరికి అతని పోరాటం ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : ఇలాంటి సైనికుడి పాత్ర‌కి రానా కరెక్ట్ గా సూట్ అవుతాడు. అందుకే అతన్ని ఏరి కోరి ఎంపిక చేసుకున్నారు. లుక్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్ లలో రానా తన మార్క్ చూపించాడు. కానీ అతని డబ్బింగ్ మైనస్.రెజీనా అప్పటి కాలం అమ్మాయిలా బాగానే సెట్ అయ్యింది.అయితే ఆమె హావభావాలు పలికించిన తీరు ఆసక్తిగా లేదు. స‌ప్త‌గిరి కొన్నిచోట్ల న‌వ్వించాడు..కానీ చివరికి అతని పాత్ర ముగించిన తీరు సిల్లీగా అనిపిస్తుంది. స‌త్య‌రాజ్‌, నాజ‌ర్‌ వంటి స్టార్ నటులు కూడా ఉన్నారు కానీ వాళ్ళ పాత్రలకి సరైన ప్రాముఖ్యత లభించలేదు.మిగతావారి గురించి ఎక్కువగా చెప్పుకునే అవకాశం దర్శకుడు కల్పించలేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : సత్య పొన్మర్ సినిమాటోగ్రఫీ బాగుంది. 1945 నేటివిటీని కళ్ళకుకట్టినట్టు చూపించాడు. లొకేష‌న్లు కూడా బాగున్నాయి. యువ‌న్ శంక‌ర్ రాజా అందించిన నేపధ్య సంగీతం పర్వాలేదు. ఆకుల శివ సంభాషణలు కొంతవరకు మెప్పిస్తాయి. ద‌ర్శ‌కుడు ఎంచుకున్న క‌థాంశం బాగానే ఉన్నప్పటికీ దానిని ఆసక్తిగా మలచడంలో అతను పూర్తిగా విఫలమయ్యాడు. ఇలాంటి దేశభక్తి కథాంశంతో తెరకెక్కించే సినిమాల్లో హృదయాన్ని తట్టిలేపే ఎమోషనల్ సన్నివేశాలు ఉండాలి. అవే చాలా ముఖ్యమైనవి.

సినిమా ప్రారంభం నుండీ ఎండింగ్ వరకు ఎమోషన్ ను దర్శకుడు క్యారీ చేయలేకపోయాడు. ఎక్కువ మైనస్ లు అన్నీ స్క్రీన్ ప్లే, దర్శకత్వం విభాగాల్లోనే కనిపిస్తాయి. క్లైమాక్స్ అనేది లేకుండానే సినిమా ఎండ్ అయిపోయిన ఫీలింగ్ ప్రేక్షకులకి కలుగుతుంది. నిర్మాతలు కూడా సరైన ప్లానింగ్ తో ఖర్చు పెట్టలేదు అని క్లియర్ గా స్పష్టమవుతుంది.

విశ్లేషణ : రానా ఉన్నాడు పెద్ద క్యాస్టింగ్ ఉంది అని ఆశగా సినిమాకి వెళ్ళిన వాళ్ళకి నిరాశే ఎదురవుతుంది. 2 గంటల 2 నిమిషాలు వేస్ట్ అయినా పర్వాలేదు అనుకుంటే తప్ప… ‘1945’ కచ్చితంగా చూడాల్సిన సినిమా ఏమీ కాదు..!

రేటింగ్ : 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus