ఒకప్పుడు ఏడాదిలో ఆరు నెలలు పూర్తవుతున్నాయంటే… ఆ ముచ్చట్లు చెప్పుకోవడానికి ఎంత టైమ్ ఇచ్చినా సరిపోదు, ఎంత రాసినా ఇంకా మిగిలే ఉంటుంది. అయితే ఈ మాయదారి కరోనా వల్ల సినిమా పరిశ్రమలో నిలకడ లేకుండాపోయింది. వంట అంతా సిద్ధం చేసుకొని… తినడానికి వడ్డిద్దాం అంటే ‘బూ’ (చైనీస్‌లో నో అని అర్థం) వచ్చేస్తోంది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఆరు నెలల్లో అరకొర వినోదమే దిక్కయింది. 2021లో ఆరు నెలలు పూర్తవుతున్న సమయంలో ఈ ఏడాది ఇప్పటివరకు వెండితెరపై వచ్చిన సినిమాలు, వాటి సంగతులు చూద్దాం!
* థియేటర్లకు జనాలు వస్తారో, రారో అనే అనుమానంతో విడుదలైంది రవితేజ – గోపీచంద్ మలినేని ‘క్రాక్’. సినిమా విడుదల విషయంలో చాలా ‘సినిమా కష్టాలు’ పడింది. అయితే వచ్చాక మాత్రం అదరగొట్టేసింది. ఈ ఏడాది తొలి హిట్ అయ్యి కూర్చుంది.
* ‘క్రాక్’ ఇచ్చిన హుషారుతో సంక్రాంతి సందర్భంగా రామ్ – కిశోర్ తిరుమల‘రెడ్’, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ – సంతోష్ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’వచ్చాయి. అయితే బాక్సాఫీసు దగ్గర సంక్రాంతి సరదాలు తీసుకురాలేకపోయాయి.
* అల్లరి నరేష్ పాత సినిమా ‘బంగారు బుల్లోడు’, ప్రదీప్ మాచిరాజు తొలి సినిమా ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కూడా తొలి నెలలోనే వచ్చాయి. నరేశ్ ఎప్పట్లాగే నిరాశపరిస్తే, ప్రదీప్ ఫర్వాలేదనిపించాడు. అయితే ఆశించిన స్థాయి వసూళ్లు మాత్రం లేవు.
* ఫిబ్రవరి జాంబీలతో మొదలైంది. తెలుగు తెర మీదకు జాంబీలు అనే కొత్త కాన్సెప్ట్‌ను తీసుకొచ్చారు ప్రశాంత్ వర్మ. తేజ సజ్జ హీరోగా వచ్చిన ఈ సినిమా వినోదాలు పండించడంలో సఫలమైంది.
* మెగా కుటుంబం నుండి మరో హీరో వస్తున్నాడు అనగానే అందరూ ‘ఉప్పెన’ కోసం ఎదురు చూశారు. అనుకున్నట్లు ఈ సినిమా వసూళ్ల ఉప్పెన సృష్టించింది. ఫర్వాలేదు అనే టాక్‌తో మొదలై… పంజా వైష్ణవ్‌తేజ్ పంజా రుచి ఏంటో బాక్సాఫీసుకు రుచి చూపించాడు. బుచ్చిబాబు దర్శకత్వం, కృతి శెట్టి అందం, అభినయం, సుకుమార్ మార్క్ యాడింగ్ సినిమాను బెస్ట్ ఫిల్మ్‌గా మార్చేశాయి.
* ఈ ఏడాది తొలి నెలలో ‘బంగారు బుల్లోడు’గా వచ్చి బోల్తా కొట్టిన అల్లరి నరేశ్ రెండో నెలలో ‘నాంది’తో వచ్చాడు. తనలో నటుణ్ని వెండితెరకు చూపించి, అభిమానులను, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు.
* ఎన్నో అంచనాలతో వచ్చిన నితిన్ – చంద్రశేఖర్ యేలేటి ‘చెక్’ఆశించిన మేర విజయం సాధించలేకపోయింది. ఏదో తెలియని చిక్కుల్లో ‘చెక్’ ఉండిపోయి అభిమానులకు కనెక్ట్ అవ్వలేకపోయింది.
* మార్చిలో వచ్చిన సినిమాలు చూస్తే… హాకీ నేపథ్యంలో ఆసక్తికంగా వచ్చిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. సినిమా ప్రచారం, హీరో కాన్ఫిడెన్స్ చూసి సినిమా వావ్ ఉంటుంది అనుకుంటే… జనాలకు కనెక్ట్ అవ్వలేకపోయింది. దీంతో సందీప్ కిషన్‌కు మరో ఫ్లాప్ పడింది.
* రైతు నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సినిమా చేశాడు శర్వానంద్. ప్రచార చిత్రాలు చూస్తే కాస్త ప్రామిసింగ్ కనిపించిందీ చిత్రం. అయితే అసలు సినిమా వచ్చేసరికి ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. దీంతో శర్వా హిట్ కోరిక అలానే ఉండిపోయింది.
* అనిల్ రావిపూడి దర్శకత్వ ‘పర్యవేక్షణ’లో వచ్చిన చిత్రం ‘గాలి సంపత్’. రాజేంద్ర ప్రసాద్, శ్రీవిష్ణు కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు. దీంతో దర్శకుడిగా పరాజయం చూడని అనిల్‌కు పర్యవేక్షణలో పరాజయం ఎదురైంది.
* ఇక చిన్న సినిమాల్లో పెద్ద విజయం అంటుంటామే… అలాంటి విజయం అందుకున్న చిత్రం మూడో నెలలోనే వచ్చింది. అదే ‘జాతిరత్నాలు’. సర్కాస్టిక్ విత్ తెలంగాణ స్లాంగ్‌లో వచ్చిన ఈ సినిమా మార్చి నెలలో నవ్వుల మాసంగా మార్చేసింది. అనుదీప్ రైటింగ్… నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి నటన సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాయి.
* మార్చిలో ఓ రేంజి బిల్డప్‌తో వచ్చిన సినిమాలు కార్తికేయ ‘చావు కబురు చల్లగా’,మంచు విష్ణు ‘మోసగాళ్లు’, నితిన్ ‘రంగ్‌దే’. ప్రచార చిత్రాలు, ప్రచార కార్యక్రమాల్లో ఉన్నంత మజా సినిమాలో లేకపోవడంతో సినిమాల మూడు రోజుల ముచ్చటగా మిగిలిపోయింది.
* టాలీవుడ్‌లో ఎప్పుడూ సమ్మర్ స్పెషల్‌గా చాలా సినిమాలు వస్తాయి. ఈ ఏడాది మాత్రం ఆ అవకాశం లేకపోయింది. ఏప్రిల్‌కి మాత్రమే టాలీవుడ్ సమ్మర్ సీజన్ ఫిక్స్ అయిపోవడమే కారణం. అలా తొలుత ఏప్రిల్‌లో వచ్చిన చిత్రం నాగార్జున ‘వైల్డ్ డాగ్’. వెండితెరపై ఈ సినిమాకు అంతగా ఆదరణ దక్కలేదు. ఓటీటీలో మాత్రం సినిమా కుమ్మేసింది. అయితే ఓటీటీ సినిమాల సంగతి తర్వాత చూద్దాం.
* ఇక బ్లాక్ బస్టర్ (ఇప్పటివరకు) ఆఫ్ ది ఇయర్ సినిమా ‘వకీల్‌సాబ్’ వచ్చింది ఈ నెలలోనే. ‘పింక్’కి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమా కమర్షియల్‌గా అదిరిపోయిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పవన్ కమ్ బ్యాక్ ఫిలింగా ఈ సినిమా రావడంతో అభిమానులు థియేటర్లకు వరుస కట్టారు.
ఆ తర్వాత కరోనా సెకండ్ వేవ్ వచ్చేసింది… సినిమాల్ని ఆపేసింది. సో తొలి ఆరు నెలల్లో నాలుగు నెలలే టాలీవుడ్ యాక్టివ్‌గా ఉంది. ఆ తర్వాత మళ్లీ ఓటీటీలు యాక్టివ్ అయిపోయాయి. అందులో ఏ సినిమాలొచ్చాయి. వాటి సంగతేంటో రేపు చూద్దాం.
అన్నట్లు ఏ సినిమాకు ఎంతొచ్చొంది అనే లెక్క మనం ఇక్కడ మాట్లాడుకోవడం లేదు. ఎందుకంటే సినిమా వచ్చిందా… బాగుందా.. లేదా అనేదే మన పాయింట్ కాబట్టి.
Most Recommended Video
తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!