చిత్ర సీమలో కేవలం నటన ఒక్కటే సరిపోదు. ఆకారం కూడా అవసరమే. బాడీని కంట్రోల్లో ఉంచుకుంటేనే పరిశ్రమలో ఉంటారు. లేకుంటే వెనక్కి వెళ్లిపోవాల్సిందే. ముఖ్యంగా హీరో, హీరోయిన్స్ అయితే ప్రతి సినిమాకి కొత్తగా కనిపించాల్సి ఉంటుంది. అందుకోసం శస్త్ర చికిత్సల జోలికి వెళ్లకుండా కసరత్తుతో శరీరంలోని కొవ్వుని కరిగించుకొని శిల్ప సౌందర్యాన్ని సొంతం చేసుకున్న నటీనటులపై ఫోకస్…
తారక్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాఖీ సినిమాలో చాలా లావుగా తయారయ్యారు. ఇలా అయితే కష్టమేనని అనుకున్నతారక్ పూర్తిగా డైట్ ఫాలో అవుతూ.. చెమటని చిందిస్తూ 30 కిలోల బరువుతగ్గారు. తాజాగా జై లవకుశ సినిమాకి త్రివిక్రమ్ తో చేయనున్న సినిమాకి పదికిలోల బరువుతగ్గి మరింత గ్లామర్ గా తయారయ్యారు.
నయనతార కేరళ బ్యూటీ నయనతార గజిని సినిమాలో బొద్దుగా కనిపించింది. అదే బిల్లా సినిమాకి వచ్చేసరికి జీరో సైజ్ తో హీట్ పుట్టించింది. ఈ మధ్య కాలంలో ఆమె శ్రమకి తగ్గ ఫలితం దక్కింది. వరుస ఆఫర్లు దక్కించుకొని దక్షిణాదిన టాప్ హీరోయిన్ స్థానంలో నిలిచింది.
సునీల్ మనది సిక్స్ ప్యాక్ కాదు ఫ్యామిలీ ప్యాక్ అంటూ తనపైన జోక్ లు పేల్చిన సునీల్.. హీరోగా మారిన తర్వాత ఫ్యామిలీ ప్యాక్ ని సిక్స్ ప్యాక్ గా మార్చేశారు. పూలరంగడు సినిమాలో అతని లుక్ చూసి చాలా మంది స్ఫూర్తి పొందారు.
మంచు విష్ణు ఢీ లో విష్ణు కి సలీం లో విష్ణు కి చాలా తేడా కనిపిస్తుంది. ఢీ లో భారీగా ఉన్న విష్ణు.. కసరత్తు చేసి స్లిమ్ గా తయారయ్యారు.
అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మొదట నుంచి బాడీని కంట్రోల్లో ఉంచుకొని వస్తున్నారు. ముఖ్యంగా దేశముదురు సినిమాలో అతని సిక్స్ ప్యాక్ చూసిన తర్వాత ఎంతగా కష్టపడ్డారో అర్ధమవుతోంది. అక్కడ నుంచి సినిమా సినిమాకి బాడీలో వేరియేషన్స్ చూపిస్తూ వస్తున్నారు.
రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. సాధారణ యువకుడిలా కనిపించేవారు. ధృవ చిత్రం కోసం చాలా కష్టపడి స్టన్నింగ్ లుక్ సొంతం చేసుకున్నారు.
వెంకటేష్ సీనియర్ హీరో అయినప్పటికీ వయసు సహకరించకపోయినా కుర్రవాడిలా గురు సినిమా కోసం విక్టరీ వెంకటేష్ శ్రమించారు. ఫిట్ బాడీతో మెస్మరైజ్ చేశారు. కుర్రహీరోలకి స్ఫూర్తిగా నిలిచారు.