99 సాంగ్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఆస్కార్ అవార్డ్ గ్రహీత రెహమాన్ తొలిసారిగా కథ అందించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించి రూపొందించిన చిత్రం “99 సాంగ్స్”. ఈ చిత్రానికి రెహమాన్ దర్శకత్వం కూడా చేయాలని ఆలోచించినప్పటికీ.. కార్యరూపం దాల్చడం కాస్త కష్టం కావడంతో విశ్వేష్ కృష్ణమూర్తికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించాడు రెహమాన్. హిందీలో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లోనూ అనువాదరూపంలో విడుదల చేశారు. ఈ చిత్రం తమిళ వెర్షన్ కు గౌతమ్ మీనన్ మాటలు సమకూర్చడం విశేషం. మరి రెహమాన్ నిర్మాతగా, రచయితగా విజయం అందుకోగలిగాడా లేదా అనేది చూద్దాం..!!

కథ: జై (ఇహాన్ భట్) సంగీతం పట్ల విపరీతమైన ఫ్యాషన్ ఉన్న యువకుడు. ఎప్పటికైనా సంగీత దర్శకుడిగా పెద్ద స్థాయికి చేరుకోవాలని, పాటలతో ప్రపంచాన్ని మైమరపించాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ క్రమంలో సోఫియా (ఎడిల్సి వర్గస్) ను తొలిచూపులోనే ప్రేమిస్తాడు జై. ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఆమె తండ్రిని కలుస్తాడు. అయితే.. సోఫియా ఫాదర్ ఒక విచిత్రమైన డీల్ ఇస్తాడు జైకి. అక్కడ్నుంచి జై లైఫ్ అనుకోని మలుపులు తిరుగుతుంది. అసలు సోఫియా ఫాదర్ హీరో జైకి పెట్టిన రూల్ ఏమిటి? అందుకు ప్రతికూలంగా జై తీసుకున్న నిర్ణయం ఏమిటి? చివరికి జై లైఫ్ & లవ్ కెరీర్ ఏ తీరానికి చేరింది? అనేది “99 సాంగ్స్” కథాంశం.

నటీనటుల పనితీరు: ప్రధాన తారాగణం అంతా కొత్తవారే. అయినప్పటికీ చూడడానికి చక్కగా ఉండడమే కాక చక్కని అభినయ ప్రదర్శన కనబరిచారు. ఇహాన్ ను నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. హావభావాల ప్రదర్శనలో మంచి పరిణితి ప్రదర్శించాడు. సోఫియా గ్లామర్, పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. అన్నిటికీ మించి మనీషా కోయిరాలాను చాన్నాళ్ల తర్వాత తెరపై చూడడం సంతోషాన్నిచ్చింది. లీసా రే తన పాత్రకు న్యాయం చేసింది. హీరో ఫ్రెండ్ గా నటించిన నటుడు అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: రెహమాన్ తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. సంగీతమే ప్రాణంగా భావించి ఎదగాలనుకునే ప్రతి ఒక్క యంగ్ మ్యూజీషియన్ ఈ సినిమాకి కనెక్ట్ అవుతాడు. అయితే.. ఆలోచన ఉంది కానీ దాని ఆచరణ సరిగా లేదు. అందువల్ల రచయితగా తొలి ప్రయత్నంలో రెహమాన్ విఫలమయ్యాడు. నిర్మాతగా మాత్రం ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఎక్కడా తగ్గలేదు రెహమాన్. అందుకే సినిమా మొత్తం చాలా రిచ్ గా ఉంటుంది.

సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే సినిమాకి వేల్యూ యాడ్ అయ్యేది. అలాగే.. స్క్రీన్ ప్లే పరంగా కాస్త ఎగ్జైట్మెంట్ క్రియేట్ చేసి ఉండాల్సింది. ఇవేమీ లేకపోవడం వల్ల సినిమా చాలా చప్పగా సాగుతుంది. అన్నిటికీ మించి తెలుగు వెర్షన్ డబ్బింగ్ వర్క్ బాగోలేదు. సత్యదేవ్ వాయిస్ హీరోకి సూట్ అవ్వలేదు. అందువల్ల హీరో డైలాగులు చెబుతున్నప్పుడల్లా వెనుక నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారేమో అనిపిస్తుంది. ఈ కారణాల వల్ల సినిమా కంటెంట్ కాసింత బాగున్నప్పటికీ జనాలకి ఎక్కదు. నిర్మాతగా రెహమాన్ ఈ విషయాల్లోనూ జాగ్రత్త వహించాల్సింది.

విశ్లేషణ: ఆలోచనలు సినిమా అవ్వవు అనేందుకు మరో ఉదాహరణ “99 సాంగ్స్”. నిజానికి ఇలా పాటల మీద బేస్ అయిన సినిమాకి పాటలు జనాల్లోకి వెళ్ళడం చాలా ముఖ్యం. కానీ.. సినిమాలోని “జ్వాలాముఖి” అనే పాట తప్ప మరేదీ జనాలకి కనీసం వినిపించలేదు. అందులోనూ హిందీ పాటల్ని తెలుగులోకి అనువదించడంతో రీజనల్ ఆడియన్స్ కి నచ్చడం చాలా కష్టమైపోయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక డబ్బింగ్ సినిమాను తెలుగు-తమిళ భాషల్లోనూ ఏకకాలంలో చిత్రీకరించామని చెప్పి రిలీజ్ చేయడం మేకర్స్ చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. అందువల్ల “99 సాంగ్స్” ఒక విఫల ప్రయత్నంగానే మిగిలిపోయింది కానీ ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. కనీసం శ్రోతలను ఆకట్టుకోలేకపోయింది.

రేటింగ్: 2/5

Click Here To Read In ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus