పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఓ సగటు పౌరుడి ప్రేమలేఖ

ప్రియమైన పవన్ ఫాన్స్ కి,

నేను ఇది ఆయన అభిమానిగానో లేక ఇంకెవరికో మద్దతుగానో రాయడం లేదు. వాస్తవాలకు దూరంగా దారుణమైన విష సర్పాలున్న వలయంలోకి మిమ్మల్ని లాక్కెళుతున్న పెయిడ్ మీడియా అనే ఒక అందమైన బట్టలు వేసుకున్న కసాయి వెంట నడుస్తున్న మీ అమాయకత్వాన్ని చూడలేక ఇది చెబుతున్నా.

పళ్ళున్న చెట్లకే రాళ్ళ దెబ్బలు అనే సామెత చిన్నప్పటి నుంచి వింటూనే పెరిగాం. అబ్బే పళ్లకు ఏమి కాకూడదు, చెట్టు అలాగే ఉండాలి అని పర్యావరణ ప్రేమికులు ఎప్పుడైనా అనడం మీరు చూసారా. పచ్చని పంటల్లో కోతల కోసం రైతులు కొడవలితో దిగినప్పుడు అది హింస అని వాళ్ళను ఆపేస్తే మనకి తినడానికి గింజలు ఉండవు. అది ప్రకృతి ధర్మం. వాటిని నెరవేర్చగలిగితేనే మనుగడ ఉంటుంది. ఇదీ అంతే.

చేస్తాడో లేదో తెలియదు, ఇచ్చిన మాట నెరవేరుస్తాడో లేదో చెప్పలేం. మీ అభిమాన నటుడు రాజకీయాల్లోకి వస్తాను అన్నప్పుడు కొందరు పనిగట్టుకుని విమర్శలు చేయడం సహజం. నోరు జారతారు, మాట పారేసుకుంటారు, ఇష్టం వచ్చినట్టు తిడతారు, మహా అంటే న్యూస్ ఛానల్ స్టూడియోకు వెళ్లి లైవ్ లో నెత్తి నోరు బాదుకుంటారు. అంతే కదా. అంతకుమించి ఏం జరగదు. ఆ మాత్రం దానికి వాళ్ళు కోరుకున్న దానికి అవసరానికి మించి స్పందించి దీన్ని పెంచి పెద్ద చేస్తున్నది ఎవరు. ఒక్కసారి బాగా ఆలోచించుకోండి. రోడ్డు మీద మొరిగే వాటిని అదే పనిగా కవ్విస్తే ఏం జరుగుతుందో మీకు తెలియంది కాదు. లేదూ మమ్మల్ని చూసి ఏ కుక్కా మొరగకూడదు అంటే చివరికి ఆసుపత్రిలో ఉండేది మీరే కానీ ఆ కుక్కకు ఏమి కాదు. ఇంకో కొత్త వాడు ఎవడు వస్తాడా అని అదే వీధిలో తిరుగుతూ వుంటుంది కానీ తానున్న చోటు మారదు. టార్గెట్ మాత్రమే మారుతుంది. దీని మీద కావాలంటే బెట్ కూడా వేసుకోవచ్చు.

ఇలా ఎందుకు జరుగుతోంది, ఎవరు చేయిస్తున్నారు అనే లోతైన విషయాలు తెలుసుకునే అనవసర ప్రయాస కంటే దీన్ని మీ వరకు ఎలా కట్టడి చేయాలో వాటి గురించి ఆలోచించండి. ఎంత పెద్ద హీరో అభిమానులైనా వారికీ కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. ఫాన్స్ కు నిజంగా అంత బలం ఉంటే కబాలి, స్పైడర్, అజ్ఞాతవాసి లాంటి సినిమాలు కొన్నవాళ్లకు నష్టాలు రాకుండా ఆయా ఫ్యాన్స్ ఓ నూట యాభై కోట్ల వసూళ్లు వచ్చే దాకా సినిమా చూడటమో లేక అంత డబ్బు వచ్చేలా ప్రయత్నాలు చేయటమో చేయొచ్చుగా. కానీ ప్రాక్టికల్ గా అది అసాధ్యం. ఎందుకంటే దీంట్లో చాలా పరిమితులు ఉన్నాయి కాబట్టి.

సరే ఎవడో ఏదో అన్నాడు, వాడిని తిట్ఠడం, కొట్టడం, చంపుతామని వార్నింగ్ ఇవ్వడం(వీడియో చూసాను)ఇవన్నీ మీరు చేస్తున్నారా లేక మీ పేరు మీద ఇంకెవరైనా చేస్తున్నారా జనానికి అనవసరం. అందరికి కామన్ గా కనిపించే పేరు ఒక్కటే. పవన్ కళ్యాణ్. ఎవరో మన హీరోని తిడుతున్నారు అనే దాంట్లో పెడుతున్న శ్రద్ధ ఫ్యాన్స్ పేరిట ఇలాంటి మితిమీరిన హింసాత్మక పనులు ఎవరు చేస్తున్నారో గుర్తించడంలో పెట్టి వాళ్ళను ఆపే ప్రయత్నాలు చేయండి. వారిని వారించి ఇలా చేయటం కూడా తప్పే అని చెప్పించండి. గౌరవం పెరుగుతుంది. అంతే తప్ప మేమిలాగే ఉంటాం అంటే మీకొచ్చిన నష్టం ఏమి లేదు. ప్రశ్నించడం కోసం మిమ్మల్ని నమ్మి జనక్షేత్రంలోకి అడుగుపెడుతున్న మీ నాయకుడు ప్రశ్నగా మిగిలిపోతాడు. దానికి మీరే కారణం అవుతారు.

ఇది మీకు నీతులు చెబుతున్న వ్యవహారంలా అనిపిస్తే నన్ను నిరభ్యంతరంగా బ్లాక్ చేసుకోండి. మానసిక పరిపక్వత తక్కువగా ఉన్నవాళ్ళతో స్నేహం నాకు కూడా ప్రమాదమే. విమర్శలకు ఎవరూ అతీతులు కారు. చరిత్రలో మాట పడని హీరో లేరు. మనమైనా చిన్నప్పుడు అమ్మానాన్న, స్కూల్ లో టీచర్లు, ఆఫీస్ లో బాసులు, వ్యాపారంలో కస్టమర్లు ఇలా ఏదో ఒక దశలో మాటలు పడుతూనే ఉంటాం. అవి మన మంచికి దోహదపడేవే తప్ప మరొకటి కాదు. హీరోకైనా ఇంకెవరికైనా ఇదే వర్తిస్తుంది.

మితిమీరిన ఉన్మాద ప్రవర్తన మీ మద్దతు తీసుకుంటున్న వాళ్లకు కూడా మంచి చేయదు. చాలా సద్దుదేశంతో తమ హీరోకి మంచి పేరు రావాలని నిస్వార్థంగా సేవా కార్యక్రమాలను చేస్తున్న నిజమైన పవన్ ఫ్యాన్స్ ని నేను చూసాను, కలిశాను కూడా. వాళ్ళ నిబద్ధత సేవ విషయంలో నాకూ లేదని ఒప్పుకుంటాను. ఇప్పుడు కావాల్సింది అలాంటి వాళ్ళే తప్ప ఆవేశంతో ఊగిపోతూ హీరో పేరిట విపరీత చర్యలకు పాల్పడుతున్న వాళ్ళు కాదు.

ఇంతా చెప్తున్నారు మరి దీనికి ప్రేరేపిస్తున్న వారికి ఏమి చెప్పరా అనే ప్రశ్నకు ఒకటే సమాధానం. వాళ్ళ లక్ష్యాలు ఏ ఉద్దేశంతో ఉన్నా డైవర్ట్ కాకుండా అదే పని మీద ఉంటున్నారు. మీరే మీకు తెలియకుండానే ఆ ఉచ్చులో పడపోయి వాళ్ళ గెలుపుకు బాటలు వేస్తున్నారు. ఆలోచించండి.

అర్థమైతే ఆచరించే ప్రయత్నం చేయండి,
అసలు అర్థమే లేదు అనుకుంటే మిమ్మల్ని టార్గెట్ చేసిన వాళ్లకు సహాయపడుతూ ఉండండి.

ఇట్లు,
Ravindranath Sriraj

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus