‘ఈరోజుల్లో’ చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన మారుతీ… ఆ తరువాత ‘బస్ స్టాప్’ ‘కొత్త జంట’ వంటి హిట్ చిత్రాలను కూడా అందించాడు. తొలినాళ్లలో ఈయన యూత్ ఫుల్ చిత్రాలు తప్ప.. మరో ఫార్మేట్ లో సినిమాలు చెయ్యలేడా అనుకుంటున్న తరుణంలో ‘భలే భలే మగాడివోయ్’ ‘బాబు బంగారం’ ‘మహానుభావుడు’ వంటి డిజార్డర్ కలిగిన చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. అది కూడా రొటీన్ అయిపోయిందని భావించి ‘శైలజా రెడ్డి అల్లుడు’ ‘ప్రతీరోజూ పండగే’ వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్లను కూడా అందించాడు.
అయితే డైరెక్టర్ కాక ముందు.. ఇతను గ్రాఫిక్స్ డిజైనర్ గా పనిచేసేవాడని చాలా మందికి తెలిసిన సంగతే. కానీ అంతకు మించిన కష్టాల్ని చూసి వచ్చానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు మారుతీ. ఆయన మాట్లాడుతూ..” అప్పట్లో నేను మా ఇంట్లో మెషిన్ కుట్టేవాడిని.నాకు ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చు. చిరిగిన దుస్తులన్నీ కుట్టేవాడ్ని. అంతేకాదు మా నాన్నగారితో కలిసి అరటిపళ్లు కూడా అమ్మేవాడ్ని.
దాంతో పాటు ఓ ఆఫీస్ లో అసిస్టెంట్ గా కూడా పని చేశాను.ఆఫీసులో టీలు, జిరాక్స్ కాపీలు అందించడం వంటివి చేసేవాడిని. అటు తరువాత రియల్ ఎస్టేట్ సంస్థలో కూడా పనిచేశాను.నాకు కష్టం విలువ తెలుసు” అంటూ చెప్పుకొచ్చాడు మారుతీ. ఈ యంగ్ డైరెక్టర్ కు కరోనా ఎఫెక్ట్ వల్ల హీరో దొరకడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలో యాక్షన్ హీరో గోపీచంద్ తో ఓ సినిమా చెయ్యాలని కూడా ప్లాన్ చేసుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.