సౌత్ తో పాటు నార్త్ ను కూడా తన నటనతో ఓ ఊపు ఊపేసిన నటుడు ప్రకాష్ రాజ్. ఇతను ఏ భాషకు సంబంధించిన సినిమాలో నటించినా ఆ రాష్ట్రం వాడే అన్నట్టు ప్రేక్షకులు ఇతన్ని ఓన్ చేసుకుంటూ వచ్చారు. అందుకే ఇతని డిమాండ్ కూడా ఆ స్థాయిలో పెరిగింది.వివాదాల్లో కూడా ఈ నటుడు ఎప్పుడూ నిలుస్తూనే ఉంటాడు. ఏ విషయం గురించి అయినా సరే ముక్కు సూటిగా.. కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడేస్తూ ఉంటాడు ప్రకాష్ రాజ్. అందుకే అప్పుడప్పుడు ఈయన్ని వివాదాల నటుడు అని కూడా అంటుంటారు.అది పక్కన పెడితే ఈయన ఎంతో మంది పేద వారిని ఆదరించి అన్నం పెట్టాడు.
ఎంతో మంది రైతులకు ఆర్ధిక సాయం కూడా చేసారు.5 ఏళ్లుగా కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని.. అక్కడి ప్రజలకు సాయం చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడిలా ఉన్న ప్రకాష్ రాజ్… తన బాల్యంలో ఎన్నో కష్టాలు పడ్డాడు.ఇతని జీవితంలో చాలా ట్రాజెడీ కూడా ఉందనే సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు.కర్ణాటకకు చెందిన ప్రకాష్ రాజ్… తల్లిదండ్రులది ప్రేమ పెళ్లి. ఇతని తల్లి ఓ క్రిస్టియన్. ఆమె అనాథ కూడా..!ఆమె నర్సు గా పనిచేస్తూ ఉండేది. ఆమె పనిచేస్తున్న హాస్పిటల్ కు వైద్య చికిత్స కోసం ఓ వ్యక్తి వచ్చేవాడు.అతన్నే ఈమె ప్రేమ వివాహం చేసుకుంది. అతనిది కూడా కర్ణాటక దగ్గర హుబ్లీనే. వీరికి ముగ్గురు సంతానం.. అందులో ప్రకాష్ రాజ్ పెద్దవాడు. ఈయనకి ఒక చెల్లి, తమ్ముడు కూడా.! ప్రకాష్ రాజ్ చదువు కోసం డబ్బులు పంపించే స్థోమత వారి తల్లిదండ్రులకు లేదు.
అందుకే చదువు మానేసి.. ఫ్యామిలీ బాధ్యతను తాను తీసుకున్నాడు. ఈయన రోజు కూలికి పనిచేసిన రోజులు ఉన్నాయి. ఒక్కపూట మాత్రమే తిని.. నీళ్లతో కడుపు నింపుకున్న రోజులు కూడా ఉన్నాయి. అటు తరువాత స్టేజ్ మీద నటించడం మొదలు పెట్టాడు. ఇతని ట్యాలెంట్ ను దర్శకుడు కే.బాల చందర్ గుర్తించి బుల్లితెర పై అతను తెరకెక్కించిన సీరియల్లో అవకాశం ఇచ్చాడు. అటు తరువాత తమిళంలో ప్రకాష్ రాజ్ కు ‘డ్యూయెట్’ అనే సినిమాలో నటించే అవకాశం లభించింది. అయితే తెలుగులో మాత్రం ‘సంకల్పం’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. తరువాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘చూడాలని ఉంది’ చిత్రం ఈయనకు మంచి బ్రేక్ ఇచ్చింది. అప్పటి నుండీ ఈయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.