టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్ కి తన ఇన్నేళ్ల కెరీర్ లో ‘లాల్ సింగ్ చడ్డా’ను మించిన షాక్ ఇంకొకటి ఉండదనే చెప్పాలి. అతడి కెరీర్ లో కొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి. కానీ రిలీజ్ కి ముందే ఈ సినిమా డిజాస్టర్ అవుతుందని ప్రేక్షకులు ఓ నిర్ణయానికి వచ్చేశారు. సినిమాను చూడడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించకపోవడం ఆమిర్ ఖాన్ కి పెద్ద షాక్ అనే చెప్పాలి.
రిలీజైన మొదటిరోజే జనాలు లేక 1300లకు పైగా షోలు క్యాన్సిల్ అయ్యాయంటే పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ప్రేక్షకులకు తన మీద ఇంత నెగెటివిటీ ఎందుకు ఏర్పడితే ఆమిర్ ఖాన్ కి కూడా అర్ధం కాలేదు. ఈ క్రమంలో ఆమిర్ ఖాన్ కొంతకాలం బ్రేక్ తీసుకోబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇక ఈ సినిమాకి నష్టాలు తగ్గించడం, కొంతవరకు తనే భరించడం మీద ఇప్పుడు ఆయన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తన రెమ్యునరేషన్ మొత్తం వదులుకొని ఈ సినిమాకి ఎక్కువ బడ్జెట్ పెట్టిన వయాకామ్ 18 వాళ్లను ఆమిర్ ఖాన్ ఆదుకోబోతున్నారట.
అంతేకాకుండా.. ఓటీటీ డీల్ విషయంలో ఇంతకముందు ఉన్న ఆలోచనను ఆమిర్ ఖాన్ పక్కన పెట్టినట్లు చెబుతున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ థియేట్రికల్ రిలీజ్ తరువాత ఆరు నెలలకు ఓటీటీలో వస్తుందని.. త్వరగా డిజిటల్ రిలీజ్ చేసి తాత్కాలిక ప్రయోజనం పొందితే.. దీర్ఘకాలంలో పెద్ద నష్టం జరుగుతుందని రిలీజ్ కి ముందు ఆమిర్ ఖాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కానీ థియేటర్లలో ఈ సినిమాకి దారుణ పరాభవం ఎదురవడంతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.
ఆరు నెలల తరువాత ఓటీటీ రిలీజ్ చేస్తే.. దాన్ని తీసుకోవడానికి ఏ ఫ్లాట్ ఫామ్ కూడా ముందుకు రాకపోవచ్చని భావిస్తున్నారు. అందుకే అక్టోబర్ లో డిజిటల్ రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారట. ముందుగా అనుకున్నదానికంటే తక్కువ మొత్తానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లతో ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను అనౌన్స్ చేయనున్నారు.