అంకిత్ కొయ్య, రాజ్ కుమార్ కసిరెడ్డి, వినోద్, మైమ్ గోపి తదితరులు.. (Cast)
అంజి కె.మణిపుత్ర (Director)
బన్నీవాసు - విద్యా కొప్పినీడి (Producer)
రామ్ మిర్యాల - అజయ్ అరసాడ (Music)
సమీర్ కల్యాణి (Cinematography)
Release Date : ఆగస్ట్ 15, 2024
ఎన్టీఆర్ (Jr NTR) బామ్మర్ది నార్నే నితిన్ (Narne Nithin) కథానాయకుడిగా నటించగా విడుదలైన రెండో చిత్రం “ఆయ్” (AAY) . గత కొంతకాలంగా విడుదలకు ఇబ్బందులుపడుతూ ఎట్టకేలకు నేడు (ఆగస్ట్ 15) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాను భారీ స్థాయిలో ప్రమోట్ చేశారు బన్నీ వాసు (Bunny Vasu) & టీమ్. మరి వాళ్ల కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించిందో లేదో చూద్దాం..!!
AAY Review
కథ: తనకు నచ్చిన కాలేజ్ లో జాయిన్ చేయలేదని యుక్త వయసు నుండి తండ్రి మీద కోపంతో పెరుగుతాడు కార్తీక్ (నార్నె నితిన్). కరోనా సెకండ్ లాక్ డౌన్ కి ముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ అమలాపురం చేరుకుంటాడు, బస్ స్టాండ్ లో కనిపించిన పల్లవి (నయన్ సారిక Nayan Sarika )ను తొలిచూపులోనే ప్రేమించి, ఆమె వెంటపడుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. మొదట్లో కార్తీక్ అంటే ఇష్టం చూపించిన పల్లవి, కార్తీక్ క్యాస్ట్ తెలిసి ఇంట్లో తెచ్చిన సంబంధం ఓకే చేసేస్తుంది.
కార్తీక్-పల్లవి ప్రేమకథకు కులం అడ్డుగా ఎందుకు మారింది? ఆ అడ్డంకిని జయించడానికి తన స్నేహితులతో కలిసి కార్తీక్ ఏం చేశాడు? చివరికి వారి ప్రేమకథ సఫలం అయ్యిందా? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఆయ్” (AAY) చిత్రం.
నటీనటుల పనితీరు: హీరోహీరోయిన్ల కంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ అండ్ మంచి యాక్టింగ్ తో ఆకట్టుకున్న నటులు అంకిత్ కొయ్య (Ankith Koyya) & రాజ్ కుమార్ కసిరెడ్డి (Rajkumar Kasireddy) . ఈ ఇద్దరి కామెడీ టైమింగ్ కి అక్కడక్కడా పేలిన పంచులు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా కాస్త డల్ అవుతున్నప్పుడల్లా ఈ ఇద్దరు కలిసి చేసిన కామెడీ సినిమాకి మెయిన్ పిల్లర్ లా నిలిచింది.
నయన్ సారిక చురుకైన హావభావాలతో అచ్చమైన తెలుగమ్మాయిలా తెరపై ఒదిగిపోయింది. ఆమె క్యారెక్టర్ ను డిజైన్ చేసిన తీరు మొదట్లో కాస్త కన్ఫ్యూజ్ చేసినా, చివర్లో ఇచ్చిన జస్టిఫికేషన్ కాస్త కవర్ చేసింది. నార్నె నితిన్ మొదటి సినిమాతో పోల్చి చూస్తే పర్వాలేదనిపించుకున్నాడు. ఎమోషనల్ సీన్స్ విషయంలో ఇంకా పరిణితి చెందాల్సిన అవసరం ఉంది. సీనియర్ యాక్టర్ వినోద్ ఈ సినిమాలో సర్ప్రైజ్ ప్యాకేజ్, ఏదో సైడ్ క్యారెక్టర్ లా స్టార్ట్ అయిన క్యారెక్టర్ ఎండింగ్ లో ఇచ్చిన ఎలివేషన్ అదిరింది.
సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు అంజి కె.మణిపుత్ర ఒక సింపుల్ కాన్సెప్ట్ ను హిలేరియస్ గా రాసుకున్న విధానం హర్షణీయం. అయితే.. ఫస్టాఫ్ లో ఎక్కువ కామెడీ సీన్స్ ఇరికించడం కోసం కథను మరీ ఎక్కువగా సాగదీయడం మైనస్ గా మారింది. నిజానికి ఈ కాన్సెప్ట్ ను రెండు గంటల్లో ముగించి ఉంటే అనవసరమైన సన్నివేశాలు ఇరికించాల్సిన అవసరం వచ్చేది కాదు. అయినప్పటికీ.. రాజ్ కుమార్ కసిరెడ్డి & అంకిత్ కొయ్య కాంబినేషన్ సీన్స్ మరియు క్లైమాక్స్ ను ఎమోషనల్ గా ఎండ్ చేసిన విధానం సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. సినిమాలో ఏదో లోపించింది అనే భావనతో ఉన్న ప్రేక్షకులందరినీ క్లైమాక్స్ సంతుష్టులను చేసింది. దాంతో.. దర్శకుడిగా, రచయితగా అంజి మంచి మార్కులు దక్కించుకున్నాడు.
పాటలు పర్వాలేదు అనిపించేలా ఉండగా, కెమెరా వర్క్ డీసెంట్ గా ఉంది. సినిమా బడ్జెట్ లో వర్షం సెటప్ కోసం ఎంత కేటాయించారో కనుక్కోవాలి అనిపించేంతలా వర్షం వరదలా పారించారు. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ గట్రా సినిమా స్థాయిలోనే ఉన్నాయి.
విశ్లేషణ: కులం అనే కాన్సెప్ట్ తో ఈమధ్యకాలంలో వచ్చిన మంచి సినిమా అంటే “ఎవ్వరికీ చెప్పొద్దు” అనే సినిమా గుర్తొస్తుంది. ఆ తరహాలోనే “ఆయ్”ను కూడా నడిపించడానికి ప్రయత్నించాడు దర్శకుడు, కొంతమేరకు విజయం సాధించాడు కూడా. అయితే.. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని నవ్వు తెప్పించలేని కామెడీ సీన్స్ & సెకండాఫ్ లో ఇరికించిన పాటలు సినిమాను కాస్త డీవియేట్ చేశాయి. అయితే.. అప్పటివరకు ధారాళంగా దొర్లిన తప్పులన్నీ క్లైమాక్స్ తో కవర్ చేయడానికి ప్రయత్నించారు చిత్రబృందం. విలేజ్ కామెడీ & ఎమోషన్స్ ను ఆస్వాదించే ప్రేక్షకులు “ఆయ్” చిత్రాన్ని థియేటర్లో చూడొచ్చు!
ఫోకస్ పాయింట్: లాంగ్ వీకెండ్ కి మంచి టైమ్ పాస్ విలేజ్ ఎంటర్టైనర్ “ఆయ్”.
రేటింగ్: 2.5/5
Rating
2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus