“దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం” వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత నాగేశ్వర్రెడ్డి-మంచు విష్ణుల కాంబినేషన్ లో రూపొందిన చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”. బ్రహ్మానందం ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులకి ఒక మంచి కామెడీ సినిమా అన్న ఫీల్ కలిగించింది. మరి ట్రైలర్ తో తీసుకొచ్చిన ఫీల్ సినిమాతో కంటిన్యూ చేశారా లేదా అనేది చూద్దాం..!!
కథ : ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడం కోసం తన గురువు అప్పలాచారి (బ్రహ్మానందం) మరియు శిష్యగణం (ప్రభాస్ శ్రీను, ప్రవీణ్)లను మోసం చేసి మరీ అమెరికా పట్టుకొస్తాడు కృష్ణమాచారి (మంచు విష్ణు). తీరా అమెరికా వచ్చాక బ్రహ్మణత్వం తప్ప అన్నీ పనులూ చేస్తూ జీవితాన్ని నెట్టుకొస్తుంటారు.
ఎట్టకేలకు తాను ప్రేమించిన రేణుక (ప్రగ్యా జైస్వాల్)ను పట్టుకోగలుగుతాడు కృష్ణమాచారి. కానీ.. అప్పటికే వేరే ఒకరితో తాను ప్రేమించిన రేణుకకు వివాహం నిశ్చయమైందని తెలుసుకొంటాడు. ఆ పెళ్లి తానే దగ్గరుండి మరీ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వలయంలా ఏర్పడిన ప్రతినాయకుల వల నుంచి రేణుకతో కృష్ణమాచారి అండ్ గ్యాంగ్ ఎలా తప్పించుకొన్నారు? అనేది “ఆచారి అమెరికా యాత్ర” కథాంశం.
నటీనటుల పనితీరు : సాధారణంగా ఎలాంటి సినిమాలో అయినా తనదైన నటనతో కాస్తో కూస్తో మెప్పించే మంచు విష్ణు ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించిన విధానం నచ్చలేదో ఏమో కానీ సినిమా మొత్తం డల్ గానే కనిపించాడు. పాపం ప్రగ్యాజైస్వాల్ అందాలన్నీ ఆరబోసినా ఫలితం లేకపోయింది. అమ్మడి పాత్రకి ఒక క్యారెక్టరైజేషన్ అంటూ లేకపోవడం మూడు పాటలకి, ప్రతి సన్నివేశంలో నడుమందాలు చూపడానికి తప్ప కథ ముందుకు సాగడానికి ఏమాత్రం ఉపయోగపడలేదు.
ఇక బ్రహ్మానందం లాంటి ఒక కమెడియన్ ని ఎలా వేస్ట్ చేసుకోవచ్చో ఈ సినిమాతో చూపించారు. ఆయనలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ ని అటు కామెడీ కాక ఇటు ఎమోషన్ గానూ ఆయన పాత్రను వినియోగించుకోలేకపోయారు. ఆయన పాత్రకి డబ్బింగ్ కూడా చాలా చోట్ల లిప్ సింక్ లేదు. ఇక మిగతా కమెడియన్స్ అందరూ తమ పెర్ఫార్మెన్స్ లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. వారి పాత్రలకి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడంతో సినిమాలో వారి పాత్రలు నిడివి పెంచడానికి తప్ప దేనికీ ఉపయోపడలేదు.
సాంకేతికవర్గం పనితీరు : చాలా కాలం తర్వాత తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కంటే పాటలే బాగున్నాయి అనిపించింది. పాపం సినిమా చూశాక ఏం చేయాలో మనోడికి కూడా అర్ధం కాలేదేమో. సిద్ధార్ధ్ సినిమాటోగ్రఫీ మాత్రం ప్రొడక్షన్ వేల్యూస్ ని బాగా ఎలివేట్ చేసింది. కాకపోతే.. ఎడిటింగ్ టైమ్ లో యాడ్ చేసిన అనవసరమైన ఎఫెక్ట్స్ కారణంగా పాటలు చూడ్డానికి కాస్త ఇబ్బందిపడాల్సి వచ్చింది.
అసలు డైరెక్టర్ జి.నాగేశ్వర్రెడ్డి రచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి అందించిన కథ అర్ధం కాలేదో లేక మంచు విష్ణుకి యాక్సిడెంట్, ఆర్టిస్ట్స్ కి అమెరికా వీసా రిజెక్ట్ అయిన కారణంగా మలేసియాలో చీట్ షూట్ చేయడం వంటి కారణాల వలనో తెలియదు కానీ.. నాగేశ్వర్రెడ్డి కెరీర్ లోనే పేలవమైన చిత్రంగా “ఆచారి అమెరికా యాత్ర”ను చెప్పుకొనే స్థాయిలో సినిమా అవుట్ పుట్ వచ్చింది.
సినిమా మొత్తానికి ఒక్కటంటే ఒక్క ఆకట్టుకొనే సన్నివేశం కూడా లేకపోవడం, అసలు ఫస్టాఫ్ కే సగం ఓపిక అయిపోతే.. సెకండాఫ్ కి వచ్చేసరికి ఇంకొన్ని క్యారెక్టర్స్ ను ఇంట్రడ్యూస్ చేసి ప్రేక్షకుల సహనాన్ని ఇంకాస్త పరీక్షించి వారి అణువణువూ నీరసించిపోయేలా చేశాడు. నాగేశ్వర్రెడ్డికి తోడుగా డైలాగ్ రైటర్ డార్లింగ్ స్వామి కూడా ఎప్పుడో 15, 20 ఏళ్ల ముందు విని వినీ బోర్ కొట్టేసిన పంచ్ డైలాగులు, సెంటిమెంట్ డైలాగులతో ఇంకాస్త చిరాకు పుట్టించాడు.
విశ్లేషణ : బ్రహ్మానందం ఉన్నాడు కదా కామెడీ ఉంటుందిలే అని ఆసక్తితో థియేటర్ కి వచ్చే ప్రేక్షకుడికి మెదడువాపు వ్యాధి తెప్పించల సత్తా ఉన్న చిత్రం “ఆచారి అమెరికా యాత్ర”.