ప్రముఖ టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ (53) (FishVenkat) కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో విలన్‌గా, కమెడియన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా కనిపించి మెప్పించారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు పాడవడంతో గత కొంతకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నారు. అయితే ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో గత కొద్ది రోజులుగా హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
రెండు కిడ్నీలు మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారని ఆయన కుమార్తె ఇటీవల మీడియాకు చెప్పారు. వైద్య సేవలు పొందలేని దీన స్థితిలో ఉన్నామని, దాతలు ఎవరైనా సాయం చేయాలని ఆమె కోరారు. ఇంతలో ఆయన ఇలా కన్నుమూశారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగలంపల్లి వెంకటేశ్. ముషీరాబాద్ మార్కెట్‌లో చేపల వ్యాపారంతో ఫిష్ వెంకట్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఆయన.. ఇక్కడి యాసతో సినిమాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ‘సమ్మక్క సారక్క’ సినిమాతో 2000లో సినిమా పరిశ్రమకు పరిచయమయ్యారు ఫిష్ వెంకట్.
ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ వచ్చారు. 2023లో ‘నరకాసుర’ సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో కనిపించారు. ఈ ఏడాది ‘కాఫీ విత్ కిల్లర్’ అనే సినిమాలో కనిపించారు. ఈ సినిఆ జనవరి 31న ఆహాలో వచ్చింది. ఫిష్ వెంకట్ సినిమాల జాబితా చూస్తే.. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లే కనిపిస్తాయి. ‘ఖుషి’, ‘ఆది’, ‘దిల్’, ‘బన్నీ’, ‘ఢీ’, ‘రెడీ’, ‘అదుర్స్’, ‘డాన్ శీను’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’, ‘హైపర్’, ‘ఖైదీ నెం 150’, ‘గద్దల కొండ గణేశ్’, ‘డీజే టిల్లు’ ఇలా చాలా మంచి సినిమాల్లో కనిపించి మెప్పించారు. ఇలా తెలుగుతోపాటు తమిళంలో ‘మదరాసి’, ‘సిరుతాయి’ లాంటి సినిమాలు కూడా చేశారు.