తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ ఏడాది కూడా కలిసి రావడం లేదు. పేరున్న నటులు, దర్శకులు, టెక్నీషియన్లు ఒకరి తర్వాత ఒకరు కాలం చేస్తున్నారు. తాజాగా తనదైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న గురుస్వామి కన్నుమూశారు. గురుస్వామి అంటే మనకు టక్కున గుర్తుకు రాకపోవచ్చు. కానీ సూపర్‌స్టార్ మహేశ్ బాబు-వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహర్షి’ చిత్రంలో రైతుగా మెప్పించిన వ్యక్తి అంటే ఎవరికైనా గుర్తుకు వస్తారు.
ఈ సినిమాలో మహేశ్ బాబుకు వ్యవసాయం అంటే ఏంటో చెప్పడంతో పాటు హీరో పాత్రకి దారి చూపుతారు. ఇకపోతే.. గురుస్వామి స్వస్థలం కర్నూలు జిల్లా వెల్దుర్తి. చదువు కూడా అక్కడే పూర్తి చేసిన ఆయన.. విద్యాభ్యాసం తర్వాత కొన్నేళ్లు కేంద్ర ప్రభుత్వ విభాగంలో ఉద్యోగం చేశారు. అయితే సంపాదన ఎటూ చాలకపోవడంతో ఉద్యోగం చేస్తూనే నాటకాలు, నటన వైపు అడుగులు వేశారు గురుస్వామి. ఈ క్రమంలోనే విజేత ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి పలు ప్రాంతాల్లో నాటకాలు వేశారు.
కానీ అంతగా గుర్తింపు రాలేదు. ఇలాంటి సమయంలో 2019లో వచ్చిన మహేశ్ ‘మహర్షి’ చిత్రం ద్వారా ఆయన పేరు తెలుగు నాట మారుమోగిపోయింది. ఆ చిత్రంలోని నటన, డైలాగుల ద్వారా ఎంతోమందిని ఆయన కదిలించారు. ఆ తర్వాత వరుసగా నితిన్ నటించిన భీష్మ, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రాల్లో అద్భుతంగా నటించారు. మరిన్ని పాత్రల ద్వారా ప్రజలకు దగ్గరవుతున్న వేళ.. గురుస్వామి అనారోగ్యం బారినపడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్ధితి విషమించడంతో కన్నుమూశారు. గురుస్వామి మరణవార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.