సీనియర్ నటుడు జయప్రకాష్ రెడ్డి ఇకలేరు. గుండెపోటు రావడంతో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. లాక్‌డౌన్ స్టార్టింగ్ నుండి ఆయన గుంటూరులో ఉంటున్నారు. ఉదయం బాత్‌రూమ్‌కి వెళ్ళినప్పుడు హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికి అక్కడే కుప్పకూలి ప్రాణాలు వదిలారని ప్రాధమిక సమాచారం. కర్నూలు జిల్లాలో ఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని సాధారణ వ్యవసాయ కుటుంబంలో జయప్రకాష్ రెడ్డి జన్మించారు. ఆయన తండ్రి పోలీస్. వృత్తిరీత్యా తండ్రికి బదిలీలు కావడంతో పలు ప్రాంతాల్లో జయప్రకాష్ రెడ్డి విద్యాభ్యాసం సాగింది. స్కూల్ డేస్ నుండి ఆయనకు నటన అంటే మక్కువ. నటుడిగా నాటకాలలో ప్రయాణం ప్రారంభించారు. ‘గప్ చుప్’ నాటకంలో జేపీ నటన నచ్చడంతో వెంకటేష్ హీరోగా తీసిన ‘బ్రహ్మపుత్రుడు’లో ఆయనకు అవకాశం ఇచ్చారు దర్శకరత్న దాసరి నారాయణరావు.
సినిమా రంగంలో ఆశించిన ఆదాయం రాకపోవడంతో మళ్ళీ వెనక్కి వెళ్లి ఉద్యోగ్యం చేసుకోవడం ప్రారంభించారు జయప్రకాష్ రెడ్డి. ‘ప్రేమించుకుందాం రా’ కోసం మూవీ మొఘల్ రామానాయుడు నుండి కబురు రావడంతో మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. తరవాత వచ్చిన ‘సమరసింహారెడ్డి’ ఇండస్ట్రీలో ఆయన స్థానం సుస్థిరం చేసింది. ఆ సినిమా జయప్రకాశ్ రెడ్డి కెరీర్ టర్న్ చేసింది. వరుసగా అవకాశాలు వచ్చాయి. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, కమెడియన్ క్యారెక్టర్లు ఆయన చేశారు. రాయలసీమ, నెల్లూరు యాసలో అవలీలగా డైలాగులు చెప్పగలగడం ఆయన స్పెషాలిటీ.
‘నరసింహనాయుడు’, ‘చెన్నకేశవరెడ్డి’, ‘నిజం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘విక్రమార్కుడు’, ‘ఢీ’, ‘రెడీ’, ‘కిక్’, ‘నాయక్’, ‘లెజెండ్’, ‘పటాస్’, ‘టెంపర్’, ‘నేనే రాజు నేనే మంత్రి’ తదితర హిట్ సినిమాల్లో జయప్రకాష్ రెడ్డి నటించారు. ‘అలెగ్జాండర్’ నాటకం ఆయనకు పేరు తీసుకొచ్చింది. అందులో ఏకపాత్రాభినయంతో ఆయన ఆకట్టుకున్నారు. ఆ నాటకాన్ని వందలసార్లు ప్రదర్శించారు. దాన్ని సినిమాగా తెరకెక్కించారు.