మార్చి 23న tv5 టీవీ ఛానల్లో జరిగిన ‘టాప్ స్టోరీ’ చర్చా కార్యక్రమంలో యాంకర్ తెలుగుచిత్ర పరిశ్రమలోని నటీమణులను ఉద్దేశించి నీచంగా మాట్లాడడంపై సినీ స్టార్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ పై “మా” సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తెలుగు హీరోయిన్స్ ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై తాజాగా నాని ఫైర్ అయ్యారు. కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానెళ్ల తీరుని నాని తప్పు పట్టారు. ప్రతి సారి సినీ పరిశ్రమలోని వారిపై ఫోకస్ పెట్టాడని విమర్శించారు.
ఈ రోజు సోషల్ మీడియా వేదికపై ఆయన స్పందించారు. “టీవీ ఛానెళ్లు, వాటి వ్యాఖ్యాతలు, పలు యూట్యూబ్ ఛానెళ్లు చిత్ర పరిశ్రమను తిట్టడంపై ఎల్లప్పుడూ దృష్టిపెట్టడాన్ని గట్టిగా ఖండిస్తున్నా. భవిష్యత్తు నిర్మాణంలో మీడియా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని గుర్తు పెట్టుకోండి. టీవీ కార్యక్రమాలను పిల్లలు చూస్తున్నారు.. ఇక చాలు.. ఆపండి” అని నాని ట్వీట్ చేశారు. సినీ స్టార్స్ మాత్రమే కాకుండా సామాన్యులు కూడా సాంబశివరావు వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అతను అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని.. వెంటనే చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హైదరాబాద్‌కు చెందిన ఓ నర్సు ఫిర్యాదు చేసింది.