‘మూవీ ఆర్ట్స్ అసోసియేషన్(మా)’ లో గొడవలు చోటు చేసుకున్నట్టు క్లియర్ గా స్పష్టమవుతుంది. ఇది వరకే ‘మా’ అధ్యక్షుడు నరేష్ లేకుండానే జీవితరాజశేఖర్ లు మీటింగ్ ఏర్పాటుచేయడంతో పెద్ద చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా.. రఘుపతి వెంకయ్య నాయుడు జీవితం ఆధారంగా రూపొందుతోన్న సినిమాలో ‘మా’ అధ్యక్షుడు నరేష్ టైటిల్ రోల్ పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం ప్రమోషన్లలో భాగంగా.. ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నరేష్ మాట్లాడుతూ.. “నేను ఒక టర్మ్ వరకే అధ్యక్ష పదవిలో ఉంటాను అని గెలిచినప్పుడే చెప్పను. ‘మా’ అంటే రాజకీయ పార్టీ కాదు. ఒక సేవా సంస్థ. మెగాస్టార్ చిరంజీవి నాటిన బీజం ఇది. దీన్ని కృష్ణంరాజు, మురళీమోహన్ వంటి ఎంతో అనుభవం గల వారు పైకి తీసుకొచ్చారు. ఇప్పటివరకూ నా పదవి కాలంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించాను. సినిమాల్లో బిజీగా ఉండడం వల్ల ఇంకా అనుకున్న పనులు పూర్తిచేయలేదు. ‘మా’లో వివాదాలు, ఆధిపత్య పోరు ఉన్న మాట నిజమే.! నా రెండేళ్ళ టర్మ్ లో ఒక ఏడాది పూర్తయ్యింది. మా అధ్యక్ష పదివి నుంచి దిగిపొమ్మంటే వెంటనే తప్పుకుంటా. ఎవరూ నన్ను బయటకు పంపించలేరు. ఎందుకంటే నేను నామినేటెడ్ లీడర్‌ని కాను. ఎలక్షన్‌లో ఎన్నుకోబడ్డ నాయకుణ్ని. నాకు పదవీ వ్యామోహం లేదు. మా అమ్మగారు మరణించి ఇంకా ఆరు నెలలు కూడా పూర్తి కాలేదు. ఆ ఇబ్బందులు కూడా కొన్ని ఉన్నాయి మాకు. ఇవన్నీ దాటి నేను చేస్తున్నాను. అందరి సహకారం కోరుకుంటున్నాను. అందరూ ఇస్తున్నారు. నరేష్ కు అజాత శత్రువు అనే పేరు ఉంది. ఏ క్యాంపులోకి అయినా వెళ్ళగలను. ఈర్ష్య, ద్వేషాలు నాకు లేవు. జీవితంలో చాలా చూశాను. నేను గొప్ప నాయకుణ్ణి అని చెప్పుకోవడం లేదు. ‘మా’ 850 కుటుంబాలకు చెందిన సంస్థ.” అంటూ చెప్పుకొచ్చాడు.