ఎన్టీఆర్ కు ఇండస్ట్రీలో చాలా మంది స్నేహితులున్నారు. కేవలం తోటి హీరోలతో మాత్రమే కాదు సహా నటులతో కూడా ఆయన ఎంతో స్నేహంగా ఉంటాడు. ఈ వరుసలో రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి వంటి వారితో పాటూ నటుడు సమీర్ కూడా ఒకడు. ఎన్టీఆర్ ఎలాగూ రాజమౌళికి మంచి స్నేహితుడు కాబట్టి ఇక ఈ ముగ్గురు కూడా ఆయనతో ఎక్కువ సినిమాలు చేసారు కాబట్టి వీరి మధ్య అనుబంధం మరింత బలపడింది. ఇక నటుడు సమీర్ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని తెలిపాడు.
సమీర్ మాట్లాడుతూ.. “ఎన్టీఆర్ నాకు ‘స్టూడెంట్ నెం.1’ సినిమా నుండీ పరిచయం. ఆ తరువాత ఎన్టీఆర్ సినిమాల్లో వరుసగా చేశాను. ఎన్టీఆర్ కబురు చేస్తే తన ఇంటికి వెళ్ళేవాడిని .. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఎన్టీఆర్ పెళ్ళి జరిగేంతవరకూ ఎక్కువగా కలిసేవాడిని. షూటింగు లేకపోతే ఎన్టీఆర్ తోనే ఎక్కువగా ఉండేవాడిని. ‘స్టూడెంట్ నెం.1’ చేసినప్పుడే ఎన్టీఆర్ నటనను ప్రత్యక్షంగా చూశాను. ‘సింహాద్రి’ సినిమాలో తన నటన ఆశ్చర్యపరిచింది. నటుడిగా తనలో ఉన్న ఫైర్ చూసి, ఆయన స్టార్ హీరో అవుతాడని అప్పుడే అనుకున్నాను. ‘ఆది’ సినిమా వచ్చాక ఈ విషయంలో మరింత స్పష్టత వచ్చింది. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ ఎదుగుతూ వచ్చాడు.. స్టార్ హీరో అయ్యాడు” అంటూ చెప్పుకొచ్చాడు.