ప్రముఖ తెలుగు కమెడియన్ సప్తగిరి (Saptagiri) ఇంట విషాదం నెలకొంది. ఆయన మాతృమూర్తి చిట్టెమ్మ మంగళవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చిట్టెమ్మ మంగళవారం లోకాన్ని విడిచి వెళ్లినట్లు సప్తగిరి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించినట్లు సమాచారం. దీంతో సప్తగిరికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
ఏప్రిల్ 9న తిరుపతిలో తల్లి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సప్తగిరి తన సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. తిరుపతికి వెళ్లి చిట్టెమ్మ భౌతికకాయానికి నివాళులర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు వెళ్తున్నట్లు సమాచారం. ఇక తెలుగు చిత్రపరిశ్రమలో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు సప్తగిరి.
అతడి అసలు పేరు వెంకట ప్రభు ప్రసాద్. కానీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. సహాయ దర్శకుడిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సప్తగిరి అల్లు అర్జున్ ‘పరుగు’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత ‘ప్రేమకథా చిత్రమ్’, ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తదితర సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు.
కొన్ని సినిమాల్లో హీరోగానూ కనిపించాడు. అయితే ఇటీవల కాలంలో సరైన పాత్ర పడకపోవడంతో కెరీర్ నత్తనడకన సాగుతోంది. ఇప్పుడు ‘పెళ్లి కాని ప్రసాద్’ అనే సినిమాలో హీరోగా నటించిన ఉన్నాడు. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తోంది.