మనుషులు బతికుండగానే చంపేయడం యూట్యూబ్ ఛానళ్లకు అలవాటు. లేనిది ఉన్నట్లు ఏదేదో వీడియో చేసిసి, థంబ్ మీద ఇంకేదో పెట్టేసి ఆ వ్యక్తులను ఇబ్బంది పెడుతుంటారు. అలా ఎందుకు రాస్తారు, రాస్తే ఏమొస్తుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఇలాంటి ఇబ్బందే పడుతున్నారు ప్రముఖ నటుడు సుమన్. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు పరిచయం ఉన్న ఆయన ‘నేను బాగానే ఉన్నాను బాబోయ్’ అని ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.
‘‘అభిమానులారా నేను క్షేమంగా ఉన్నాను, ఆందోళన చెందొద్దు’’ అంటూ సుమన్ తన టీమ్ ద్వారా మీడియా తెలియజేశారు. ప్రస్తుతం తాను ఓ సినిమా షూటింగ్ కోసం బెంగళూరులో ఉన్నానని, అయితే తనకేదో అయిపోయిందని, కొన్ని ఉత్తరాదికి చెందిన యూట్యూబ్ ఛానల్స్ వీడియోలు పెడుతున్నాయని సుమన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ఆ వీడియోలను చూసి ఎవరూ ఆందోళన చెందొద్దని ఆయన మరోసారి తెలియజేశారు.‘‘నటుడు సుమన్ మరణించారు’’ అంటూ ఉత్తారాదికి చెందిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో కథనాలు వస్తున్నాయి.
తొలుత ఒకటి, రెండుగా కనిపించిన ఈ వీడియోలు ఆ తర్వాత ఎక్కువయ్యాయి. దీంతో సుమన్ వాటిపై స్పందించాల్సి వచ్చింది. సన్నిహితుల ద్వారా యూట్యూబ్ వీడియోల సంగతి తెలుసుకున్న సుమన్ ఆ ఫేక్ న్యూస్‌ను ఖండించారు. నిరాధారమైన, ప్రేక్షకులకు ఆందోళనకు గురి చేసే ఇటువంటి వార్తలు ప్రసారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాంటి ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని కూడా ఆయన తెలియజేశారు.