తెలుగు సినిమా ఇండస్ట్రీలో రచయితగా దర్శకుడిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సీనియర్ నటుడు తనికెళ్ల భరణికి లోక్‌నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాన్ని అందుకోబోతున్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వాహకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఈ విషయాన్ని తెలియజేస్తూ సోమవారం సాయంత్రం కళాభారతిలో నటుడు తనికెళ్ల భరణికి ఈ పురస్కారం అందజేయనున్నట్లు ఆదివారం విలేకరుల సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ వెల్లడించారు.
నేడు సాయంత్రం కళాభారతిలో ఎంతో ఘనంగా లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇకపోతే తెలుగు సంస్కృతి, సాహిత్య,భాష రంగాలకు వివిధ సేవలు అందిస్తున్నటువంటి వారికి లోక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అందిస్తున్నట్లు ఈయన వెల్లడించారు. గత 18 సంవత్సరాల నుంచి ఈ పురస్కారాన్ని అందిస్తున్నట్లు లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది వార్షికోత్సవ కార్యక్రమాలలో భాగంగా ఈ పురస్కారాన్ని నటుడు తనికెళ్ల భరణికి అందిస్తున్నట్లు వెల్లడించారు.
కేవలం లోక్ నాయక్ పురస్కారం మాత్రమే కాకుండా రెండు లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ తెలియజేశారు.ఇలా తెలుగు భాష కోసం కృషి చేస్తున్న వారికి మాత్రమే కాకుండా ఈ కార్యక్రమంలో మరికొందరిని కూడా సన్మానిస్తున్నట్లు ఈయన తెలిపారు.
సీనియర్ నటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి తుది వరకు ఆయన వెన్నంటే ఉన్న వ్యక్తులను కూడా ఈ సందర్భంగా సన్మానిస్తూ వారిని గౌరవిస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక నేడు సాయంత్రం ఈ కార్యక్రమం కళాభారతిలో ఘనంగా జరగనుంది.