మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు గతేడాదికి మించి ఈ సారి ఆసక్తికరంగా సాగనున్నాయని తెలుస్తోంది. కారణం అధ్యక్ష పదవి కోసం పోటీ చేస్తున్న వారందరూ ఫైర్ బ్రాండ్‌లలానే కనిపిస్తున్నారు. ఎవరికివారు తమ వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలో విమర్శలు, ప్రతివిమర్శల పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్‌పై… ప్రస్తుత పోటీదారు హేమ తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో కొన్ని రాజకీయంగా కనిపించినా… ఇంకొన్ని మాత్రం నరేశ్ మీద ఉన్న వ్యతిరేకతను చూపిస్తున్నాయి.
‘మా’ ఎన్నికలు జరగకుండా వాయిదా వేయాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారని హేమ ప్రధానంగా ఆరోపించారు. మళ్లీ నరేశ్‌ను పీఠం మీద కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతోందనేది ఆమె మాట. ఇక్కడివరకు రాజకీయ దాడి అనుకోవచ్చు. అయితే ‘మా’లో నిధులు నిండుకున్నాయి అంటూ ఆమె చేసిన విమర్శ ఇప్పుడు టాక్ ఆఫ్ ది టాలీవుడ్ అయిపోయింది. అసలు మా నిధులు ఎంతుండాలి, ఎంతున్నాయి, నరేశ్ కార్యవర్గం ఎంత యాడ్ చేసిందనేది ఇప్పుడు లెక్కలు తేలాల్సిన విషయం.
హేమ మాటల ప్రకారం అయితే ఐదు కోట్ల రూపాయల నిధులు ‘మా’ దగ్గర ఉండేవట. నరేశ్ తన పదవీకాలంలో మూడు కోట్లు ఖర్చు చేశారని… మిగిలిన రెండు కోట్ల రూపాయల లెక్కల తేలాలని హేమ వ్యాఖ్యానించారు. అంటే ఆ రెండు కోట్లు ఏమయ్యాయి అని ఆమె అడిగారా… లేక మీరే లెక్క తేల్చండి అన్నారా అనేది తెలియడం లేదు. మరోవైపు ఆ మూడు కోట్ల ఖర్చు గురించి కూడా ఆమె మాట్లాడారు. మెడికల్ ఇన్సూరెన్స్, ఆఫీసు ఖర్చుల పేరుతో వాటిని ఖర్చు చేశారని చెప్పారామె.
గతంలో ఇన్సూరెన్స్ అవసరాల కోసం ‘మా’ కార్యవర్గం బయట నుండి ఫండ్స్ రూపంలో తీసుకొచ్చేదట. అయితే ఈసారి నరేశ్ మాత్రం ‘మా’ ఫండ్స్ నుండి ఖర్చుపెట్టేశారట. దీంతో ఇప్పుడు ‘మా’ దగ్గర ఫండ్స్ లేకుండా పోయాయని హేమ ఆరోపిస్తున్నారు. మరి హేమ ఆరోపణల విషయంలో నరేశ్ ఎలా స్పందిస్తారో చూడాలి.