మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి అనేక వార్తలు ప్రచారంలోకి వస్తున్న సంగతి తెలిసిందే. ‘మా’ ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు ప్రకాష్ రాజ్, విష్ణు, హేమ, జీవిత, సీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. అయితే తాజాగా ‘మా’ ఎన్నికల గురించి హేమ వాయిస్ మెసేజ్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ ఎన్నికలు జరగకూడదని నరేష్ అధ్యక్షుడిగా కొనసాగాలని అవతలివాళ్లు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారని హేమ అన్నారు.
‘మా’ అసోసియేషన్ ఇప్పటివరకు రూపాయి కూడా సంపాదించలేదని హేమ చెప్పుకొచ్చారు. 5 కోట్ల రూపాయలలో 3 కోట్ల రూపాయలు నరేష్ ఖర్చు చేశారని హేమ అన్నారు. గతేడాది మెడికల్ క్లైమ్, ఈ ఏడాది మెడికల్ క్లైమ్ కోసం రెండున్నర కోట్ల రూపాయలకు పైగా ఖర్చైందని హేమ చెప్పుకొచ్చారు. సీనియర్ నరేష్ కుర్చీ దిగకూడదని ఎన్నికలు జరగకూడదని ప్లాన్ చేస్తున్నారని హేమ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మనందరికీ ‘మా’ ఎన్నికలు కావాలని లెటర్ పంపిస్తున్నానని ఆ లెటర్ పై సంతకం చేసి పంపించాలని హేమ కోరారు. ‘మా’లో ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే సంవత్సరం పెన్షన్లు ఇవ్వడానికి కూడా డబ్బులు ఉండవని హేమ చెప్పుకొచ్చారు. హేమ కామెంట్ల వల్ల ‘మా’ ఎన్నికల విషయంలో కొత్త మలుపులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య గట్టి పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్న తరుణంలో హేమ చేసిన కామెంట్లు చర్చనీయాంశం అయ్యాయి. అయితే హేమ వాయిస్ మెసేజ్ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్ల నుంచి వాయిస్ మెసేజ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.