సినిమాలో పాత్ర పేరును తమ పేరుగా మార్చుకున్న హీరోయిన్లు చాలా తక్కువ ఉంటారు. అలా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత అనూహ్యంగా వెనుకబడి పోయిన హీరోయిన్లు ఇంకా తక్కువ ఉంటారు. అలాంటి జాబితాలో ఉన్న హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty) . ‘ఉప్పెన’ (Uppena) సినిమాలోని బేబమ్మ పేరునే కృతి శెట్టికి ఇప్పటికీ పెడుతున్నారు అంటే ఆ పాత్రతో ఆమె ఎంతలా ఇంపాక్ట్ చూపించింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఆ స్థాయి ఇంపాక్ట్ చూపించడానికి మళ్లీ వస్తోంది కృతి.
‘ఉప్పెన’ సినిమా తర్వాత ఆరు సినిమాలు చేసింది కృతి శెట్టి. అందులో చివరి నాలుగు సినిమాలు ఇబ్బందికర ఫలితం తెచ్చిపెట్టాయి. దీంతో ఇక ఆమె కెరీర్ అయిపోయింది అని అనుకున్నారంతా. ఆ సమయంలోనే ఆమె ‘మనమే’ (Manamey) అనే సినిమా సైన్ చేసింది. ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కెరీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ విరామం తీసుకున్నది కాదు, వచ్చింది అని చెప్పింది.
ఏంటీ.. ఆ మధ్య తెగ సినిమాలు చేశారు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత వస్తున్నారు అంటే.. నిజమే, అయితే నేను తమిళంలో మూడు సినిమాలు చేస్తున్నాను. మలయాళంలో ఒక సినిమా చేశాను. అందుకే తెలుగు సినిమాలకు గ్యాప్ వచ్చింది అని చెప్పింది కృతి. అయితే తెలుగు సినిమా తనకు ఎప్పటికీ ప్రత్యేకం అని చెప్పింది. తనకు ఇంత పేరు, ప్రేమ దక్కిందంటే తెలుగు ప్రేక్షకులే కారణం అని చెప్పింది.
మంచి కథల్ని సెలక్ట్ చేసుకోవడం తప్ప నా చేతుల్లో ఏమీ ఉండదు. సినిమా విజయానికి నేనొక్కదాన్నే కారణం కాదు. ఆ విషయంతొలి సినిమాతోనే తెలుసుకున్నాను అని చెప్పింది కృతి. అందుకే సినిమాల ఫెయిల్యూర్స్ తనపై పెద్దగా ప్రభావం చూపించవు అని అంటోంది. ఎందుకు అని అడిగితే ‘మన చేతుల్లో లేని విషయాలపై ఆందోళన వద్దు’ అని అంటోంది. 20 ఏళ్ల వయసులోనే మంచి పరిణితి సాధించింది కదా.