Vishwambhara: ‘విశ్వంభర’ కోసం ‘స్టాలిన్‌’ బ్యాచ్‌ను వరుసగా దింపేస్తున్నారుగా!

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) – వశిష్ఠ మల్లిడి (Mallidi Vasishta) కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’ (Vishwambhara) . ఈ సినిమాకు ‘స్టాలిన్‌’ (Stalin) సినిమాకు మధ్య ఉన్న బంధం కొనసాగుతూనే ఉంది. అదేంటి అందులో హీరో – హీరోయిన్‌ ఇందులోనూ నటిస్తుంటే బంధం అనేస్తారా అనుకుంటున్నారా? వాళ్లే కాదు.. మరో నటి కూడా ఇప్పుడు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం అయితే రాలేదు కానీ.. నటించడం అయితే పక్కా అంటున్నారు. ఎన్నికలు, విదేశీ పర్యటన వల్ల మెగాస్టార్ ‘విశ్వరంభర’కు చిన్న బ్రేక్‌ ఇచ్చారు.

త్వరలో కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు అని అంటున్నారు. ఈ నేపథ్యంలో సెట్స్‌లోకి కొత్త నటి వస్తారు అని చెబుతున్నారు. ఆమెనే ఖుష్బూ (Khushbu) . ‘స్టాలిన్‌’ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన ఖుష్బూను ఇప్పుడు ‘విశ్వంభర’లో కూడా నటిస్తారట. ఈ సినిమాలో పవర్ ఫుల్ లేడీ పాత్ర ఒకటి ఉందట. ఆ పాత్ర కోసం తొలుత విజయశాంతిని సంప్రదించగా ఆమె మళ్లీ నటించాలని లేదని తిరస్కరించారట. దీంతో ఇప్పుడీ ఆఫర్ ఖుష్బూని వరించినట్టు చెబుతున్నారు.

‘స్టాలిన్‌’ సినిమాలో ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలసి నటిస్తే ఎలాంటి అవుట్‌పుట్‌ ఉంటుందో అనే ఆసక్తి మొదలైంది. ఆమె సెట్స్‌లో అడుగుపెట్టినప్పుడు అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా సెట్స్‌లోకి త్రిష (Trisha) కూడా త్వరలో వస్తారట. చిరంజీవి, ఆమె మీద సన్నివేశాలు తెరకెక్కిస్తారట. ‘విశ్వంభర’ సినిమాలో అయిదుగురు తోబుట్టువులకు అన్నయ్యగా భీమవరం దొరబాబు అనే పాత్రలో చిరంజీవి కనిపిస్తారని టాక్.

ఇక అక్టోబరులోగా సినిమాకు గుమ్మడికాయ కొట్టేసి పోస్ట్ ప్రొడక్షన్ మీద కూర్చోవాలని టీమ్‌ అనుకుంటోందట. ఎందుకంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు చాలానే ఉంటాయి అంటున్నారు. ఏదేమైనా వచ్చే ఏడాది జనవరి 10కి సినిమాను రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట. ఇప్పటికే సినిమా నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్‌ ఆ డేట్‌ ఆధారంగా బిజినెస్‌ నిర్వహిస్తోందని చెబుతున్నారు. అలాగే డిజిటల్‌, శాటిలైట్ రైట్స్‌ విషయంలోనూ టీమ్‌ లెక్కలు అప్పుడే షురూ అయ్యాయట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus