సౌత్ సినిమాలో ఫుల్ యాక్టివ్‌గా హీరోయిన్లలో అదితి శంకర్ (Aditi Shankar) ఒకరు. అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) కుమార్తెగా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నా.. సినిమా అంటే ఆసక్తి ఉన్న సగటు అమ్మాయిగా పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో తెలుగులో ‘భైరవం’ (Bhairavam) సినిమాతో ఎంట్రీ ఇవ్వబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Sreenivas), మనోజ్ మంచు (Manchu Vishnu) , నారా రోహిత్ (Nara Rohit) కథానాయకులుగా నటించిన ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అదితి శంకర్ మీడియాతో మాట్లాడింది. ఈ క్రమంలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
‘భైరవం’ సినిమా టీమ్ గురించి చెబుతూ.. మంచు మనోజ్ తనకు ముందే తెలుసు అని, తొలి రోజు సినిమా సెట్‌కి వచ్చి ‘ఇక్కడేం చేస్తున్నావ్’ అని అడిగాడు. ఈ సినిమాలో నేను నటిస్తున్నానని చెప్పా అని తెలిపింది అదితి. సినిమా సెట్‌లో సరదా సరదాగా ఉండేవాళ్లమని కూడా తెలిపింది. పాట చిత్రీకరణలో సాయి శ్రీనివాస్‌ని కలిశానని, అందరితో కలుపుగోలుగా ఉండేవాడని చెప్పింది. నారా రోహిత్ మంచి మనిషి అంది అదితి.
తండ్రి శంకర్ గురించి మాట్లాడుతూ.. శంకర్ కూతురు అనే గుర్తింపుని గౌరవంగా భావిస్తాను. అయితే ఆ గుర్తింపు ఒత్తిడి పెంచుతుందని ఎప్పుడూ అనుకోలేదని తెలిపింది. అంతే కాదు తాను చేస్తున్న సినిమాల గురించి తండ్రికి ఏమీ తెలియదని చెప్పింది. ఆయన సినిమాలతోనే ఆయన బిజీగా ఉంటారని, అంతేకాకుండా ఆయన సినిమాల విశేషాలు గురించి మాకు చెప్పరు అని పేర్కొంది. ఆయన సినిమాని ఓ పసిపాపలా చూసుకుంటారు అని ఆసక్తికర విషయం చెప్పుకొచ్చింది.
అయితే తన సినిమాల్ని తండ్రి తప్పకుండా చూడాల్సిందేనట. ఆయనకి మరో ఆప్షన్ లేదు అని నవ్వేసింది అదితి. ఇక తన మనసులో ఉన్న సినిమాల గురించి చెబుతూ.. చారిత్రక కథలు, పీరియాడిక్ చిత్రాలు అంటే నచ్చుతుందని, సవాళ్లు ఎదుర్కొనే మహిళల పాత్రలో నటించడం ఇష్మని, అలాంటి పాత్రల కోసం ఎదురుచూస్తున్నా అని చెప్పింది అదితి.