దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. సినిమా ఇండస్ట్రీ బాగుండాలంటే.. చిన్న సినిమా బ్రతకాలి అని. కానీ.. ఇప్పుడు చిన్న సినిమాని పట్టించుకునే నాథుడే లేడు. ఈమధ్యకాలంలో హిట్ అయిన చిన్న సినిమాలు చూసినా.. అవి ఒక బడా మేకర్ లేదా బడా సంస్థ నుంచి వచ్చిన సినిమాలే. అయితే.. ఒక ప్యాషన్ తో ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీసే దర్శకనిర్మాతలకు ఇండస్ట్రీ పెద్దలు సహాయం అందించడం అనేది పక్కన పెడితే.. కనీసం పట్టించుకోవడం లేదు.
ఇలా ఎందుకు జరుగుతుంది? ఇండస్ట్రీకి నాయకత్వం వహిస్తున్నవాళ్లు ఎందుకని చిన్న సినిమాలను కనీసం ఎంకరేజ్ చేయడం లేదు? అనేందుకు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు, చెప్పడానికి సిద్ధంగా కూడా లేరు. ఈ విషయమై సెన్సిబుల్ డైరెక్టర్ రాజ్ రాచకొండ (Raj Rachakonda) కాస్త ఘాటుగానే స్పందించారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మించిన “23” (23 Movie) సినిమా మే 16 విడుదలవుతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గానే ఉన్నప్పటికీ.. సినిమాకి క్రేజ్ రాలేదు.
కనీసం ఈ సినిమా మే 16న విడుదలవుతుందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఈ విషయమై రాజ్ రాచకొండ మాట్లాడుతూ.. “ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పనే ఈ తరహా సినిమాలను ప్రమోట్ చేయడం, ఆ ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగాను పట్టించుకునే నాథుడే లేడు” అని తన బాధ వెల్లడించారు.
ఇదేమీ సింపుల్ స్టేట్మెంట్ కాదు. చిన్న సినిమాలకి జరుగుతున్న అన్యాయం. అది కూడా దిల్ రాజు అధ్యక్షత వహిస్తున్న FDC గురించి ఇలాంటి కామెంట్స్ వినిపించడం అనేది సబబు కాదు. మరి దిల్ రాజు ఈ విషయమై ఏమైనా స్పందిస్తారా? లేక పెడచెవిన పెడతారా? అనేది చూడాలి.