సరిగ్గా 3 ఏళ్ళ క్రితం వక్కంతం వంశీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రం విడుదలయ్యింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేకపోయింది. అంతకు ముందు ఎన్నో హిట్ సినిమాలకు రైటర్ గా పనిచేయడం వలన వక్కంతం వంశీని డైరెక్టర్ గా లాంచ్ చెయ్యడానికి చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. కానీ ఇతని మొదటి సినిమా ఫలితం తేడా కొట్టడంతో.. వాళ్ళు తప్పుకున్నారు.
తరువాత వంశీ చాలా మంది స్టార్ హీరోలను అప్రోచ్ అయ్యాడు కానీ.. ఇతన్ని నమ్మి ఛాన్స్ ఇవ్వడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. అయితే ఇప్పుడు ఓ మీడియం రేంజ్ హీరో వంశీకి ఛాన్స్ ఇచ్చినట్లు వినికిడి. వివరాల్లోకి వెళితే యూత్ స్టార్ నితిన్.. ‘అంధాదున్’ రీమేక్ తరువాత వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ‘భీష్మ’ తరువాత నితిన్ నటించిన ‘చెక్’ మూవీ డిజాస్టర్ కాగా.. ‘రంగ్ దే’ మూవీ యావరేజ్ గా నిలిచింది.
దాంతో నితిన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల విషయంలో జాగ్రత్త పడాలని డిసైడ్ అయ్యాడు. ఇప్పటికే కృష్ణ చైతన్య డైరెక్షన్లో చెయ్యాల్సిన ‘పవర్ పేట’ ప్రాజెక్టుని పక్కన పెట్టాడు. దీని ప్లేస్ లో వక్కంతం వంశీ డైరెక్షన్లో ఓ యూత్ ఫుల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ను చెయ్యాలని డిసైడ్ అయినట్టు తాజా సమాచారం.