మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సంక్రాంతి సందర్భంగా ఈనెల 10 న థియేటర్ లోకి వచ్చింది. తొలి రోజు మిశ్రమ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ అందుకుంది. ప్రీమియర్ షోల ద్వారా ఓవర్ సీస్ లో అజ్ఞాతవాసి మిలియన్ డాలర్ల మార్క్ ని క్రాస్ చేసింది. నైజాం ఏరియా లోను ఫస్ట్ డే 5.40 కోట్ల షేర్ ను వసూలు చేసి పవన్ క్రేజ్ ని చాటింది. అభిమానుల అంచనాలను అజ్ఞాతవాసి అందుకోకపోవడంతో రెండో రోజు నుంచి అన్ని ఏరియాల్లో కలక్షన్స్ తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా ఆంధ్రా జిల్లాలో వసూళ్లు డీలా పడ్డాయి. ట్రేడ్ వర్గాల వారు తెలిపిన సమాచారం ప్రకారం… కృష్ణా జిల్లాలో తొలిరోజు 1.82 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ చిత్రం 2వ రోజు నుంచి 6వ రోజు 26.20 లక్షలు మాత్రమే రాబట్టగలిగింది.
దీంతో ఆరు రోజుల్లో 2.84 కోట్లను అజ్ఞాతవాసి (కృష్ణా జిల్లా) వసూలు చేసింది. ఇక గుంటూరు ఏరియాలో ఫస్ట్ డే 3.78 కోట్లతో అదరగొట్టిన పవన్ చిత్రం 2 నుంచి 6వ రోజు వరకు 28.64 లక్షలను వసూలు చేసి, 4.81 కోట్ల షేర్ ను సాధించింది. ఈ రెండు ఏరియాల్లో అత్యధిక రేటుకి అజ్ఞాతవాసి థియేటర్స్ రైట్స్ కొనుగోలు చేసారని సమాచారం. ఆ మొత్తం తిరిగి రావాలంటే ఇంకా కోట్లు రావాల్సి ఉందని తెలిసింది. నెగిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సినిమాలో వెంకటేష్, పవన్ కాంబో సన్నివేశాలను కలిపింది. మరికొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేసింది. ఈప్రయత్నం కలక్షన్స్ పెంచుతుందని త్రివిక్రమ్ టీమ్ భావిస్తోంది. వారి అంచనా ఎంత నిజమవుతుందో రెండు రోజుల్లో తెలియనుంది.