Aho Vikramaarka Review in Telugu: అహో విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • దేవ్ గిల్ (Hero)
  • చిత్ర శుక్ల (Heroine)
  • తేజస్విని పండిట్ , సాయాజీ షిండే , ప్రవీణ్ తార్డే, ప్రభాకర్, విక్రమ్ శర్మ, బిత్తిరి సత్తి (Cast)
  • పేట త్రికోటి (Director)
  • ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా (Producer)
  • రవి బస్రూర్ (Music)
  • కరమ్ చావ్లా గురు ప్రసాద్ ఎన్ (Cinematography)
  • Release Date : ఆగస్టు 29, 2024

“మగధీర”తో విలన్ గా తెలుగు సినిమాకి పరిచయమైన నటుడు దేవ్ గిల్. ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లయ్యాక.. హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం రాజమౌళి వద్ద సీనియర్ అసోసియేట్ గా చాలా కాలంగా వర్క్ చేస్తున్న త్రికోటి దర్శకత్వంలో నటించిన చిత్రం “అహో విక్రమార్క”. తెలుగు, మరాఠీ, హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించింది? అనేది చూద్దాం..!!

Aho Vikramaarka Review

కథ: పుణెలోని ఓ కాలనీకి చెందిన 1200 మంది కూలీ పనికి అని వెళ్లి 25 ఏళ్ల పాటు కనిపించకుండాపోతారు. వాళ్లు ఎక్కడున్నారో తెలియక, అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో కూడా తెలియక బాధపడుతుంటారు. అదే సమయంలో పూణే పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన విక్రమార్క (దేవ్ గిల్) అనుకోకుండా ఈ కేస్ ను డీల్ చేయాల్సి వస్తుంది. అసలు ఆ 1200 మందికి విక్రమార్కకి సంబంధం ఏమిటి? వాళ్లని విక్రమార్క కాపాడగలిగాడా? ఈ క్రమంలో అతడు ఎదుర్కొన్న సమస్యలేమిటి? అనేది “అహో విక్రమార్క” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తానికి భాష రాకపోయినా.. తెలుగు డైలాగ్స్ కు లిప్ సింక్ ఇస్తూ కాస్త పాత్రకు తగ్గ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఏకైక నటి తేజస్విని పండిట్. పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో, తల్లి పాత్రలో కాస్త బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇక దేవ్ గిల్ ను తెరపై చూస్తున్నప్పుడల్లా కోట శ్రీనివాసరావు గుర్తొస్తుంటారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో “దేవ్ గిల్.. యాక్టింగ్ నిల్” అని చేసిన కామెంట్ పదే పదే గుర్తొస్తుంది.

దేవ్ గిల్ చాలా కష్టపడి చేసే నటన చూస్తే అయితే నవ్వుకుంటారు లేదా ఫోన్ చూసుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ ను ప్రేమగా చూస్తున్నా కూడా ఏదో కసిగా చూస్తున్నట్లుగానే ఉంటుంది. ఇక క్లైమాక్స్ సీక్వెన్స్ కి ముందు వచ్చే సెంటిమెంట్ సాంగ్ లో దేవ్ గిల్ నటన మంచి మీమ్ మెటీరియల్ గా మారడం ఖాయం.

హీరోయిన్ గా చిత్ర శుక్లా, మెయిన్ విలన్ గా ప్రవీణ్ థార్డే వంటి నటులు కేవలం అలంకారంగా ఉండిపోయారు. ఇక మిగతా నటీనటుల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: ప్రొడక్షన్ డిజైన్ కి, సినిమాలో కంటెంట్ కి అస్సలు సంబంధం ఉండదు. నిర్మాణం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ వర్క్ ను కూడా మెచ్చుకోవాలి. కట్ చేస్తే.. ప్రొడక్షన్ & ఆర్ట్ వర్క్ డిపార్టుమెంట్ల పనితీరుని ఏ ఒక్కరూ రెస్పెక్ట్ చేయలేదు. సంగీత దర్శకుడు రవి బస్రూర్ మొదలుకొని దర్శకుడి వరకు అందరూ అత్యంత పేలవమైన వర్క్ తో ఊదరగొట్టారు.

ఫైట్ సీన్స్ తప్పితే.. త్రికోటి ప్రతిభకు నిదర్శనంలా నిలిచే సన్నివేశం సినిమాలో ఒక్కటంటే ఒక్కటి కూడా లేకపోవడం అనేది గమనార్హం. పైపెచ్చు చాలా సన్నివేశాల కంపోజిషన్ కామెడీగా ఉంది. ఇదేమీ కొత్త కథ కాదు, కనీసం కథనం లేదా సన్నివేశాలైనా ఆకట్టుకునే రీతిలో తెరకెక్కించాలని దర్శకుడు త్రికోటికి ఎందుకు అనిపించలేదో అర్థం కాలేదు. సినిమా మొత్తం ఒక రేంజ్ అనుకుంటే.. చివర్లో వచ్చే ఎమోషనల్ సాంగ్ లో 6 అడుగుల హీరోను దుప్పటి ఉయ్యాల కట్టి పడుకోబెట్టాలన్న ఆలోచన ఎందుకు వచ్చిందో దర్శకుడికే తెలియాలి. ఇలా చెప్పుకుంటూపోతే.. సినిమాలో గేలి చేసే సన్నివేశాలు కోకొల్లలుగా ఉన్నాయి. సో, వాటి గురించి ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన పని లేదు.

విశ్లేషణ: కోట్ల రూపాయల డబ్బును వృథా చేసి.. సినిమా మొత్తానికి చెప్పుకోవడానికి ఒక్క ప్లస్ పాయింట్ కూడా లేకుండా చిత్రబృందం జాగ్రత్తపడి ప్రేక్షకుల సమయాన్ని వృథా చేసిన చిత్రం “అహో విక్రమార్క”. థియేటర్లలో ఎలాగు ఎక్కువకాలం ఉండదు కానీ.. ఓటీటీ రిలీజ్ తర్వాత మీమ్ పేజీలకి మంచి స్టఫ్ అవుతుందీ చిత్రం.

ఫోకస్ పాయింట్: అహో విక్రమార్కా.. మంచి మీమ్ కంటెంట్ ఇచ్చితివిగదా!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus