ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ (Ajay Devgn) మరో జీవిత కథను సినిమాగా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇటీవలే ‘మైదాన్’తో (Maidaan) ఫుట్‌బాల్ దిగ్గజం సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించిన అజయ్ దేవగణ్ ఇప్పుడు క్రికెటర్ కథను చేయబోతున్నాడు. మన దేశ మొట్టమొదటి దళిత క్రికెటర్ పల్వంకర్ బాలూ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఆ సినిమాలో అజయ్‌ను ప్రధాన పాత్రధారిగా ఎంచుకున్నారట. ప్రముఖ చరిత్రకారుడు రామచంద్ర గుహ రచించిన ‘ఏ కార్నర్ ఆఫ్ ఏ ఫారెన్ ఫీల్డ్’ అనే పుస్తకం ఆధారంగా తిగ్మన్షు ధులియా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ విషయాన్ని నిర్మాత ప్రీతీ సిన్హా ఎక్స్ (మాజీ ట్విటర్) ద్వారా తెలిపారు. ఈ ఏడాది ఆఖరులో సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందట. మరోవైపు అజయ్ దేవగణ్ నీరజ్ పాండే సినిమా ‘ఔర్ మే కహా ధమ్ థా’ అనే సినిమాలోనూ నటిస్తున్నాడు. ఆ సినిమాలో టబు మరో ప్రధాన పాత్రధారి. ఆ సినిమాతోపాటు రోహిత్ శెట్టి పోలీసు సినిమా ‘సింగమ్ అగైన్’లో కూడా నటిస్తున్నాడు. సౌత్‌తో వచ్చిన ‘సింగమ్’ (Singham) సిరీస్‌ను బాలీవుడ్‌లో అజయ్ – రోహిత్ శెట్టి (Rohit Shetty) తెరకెక్కించి విజయాలు అందుకున్నారు.
అయితే సూర్య (Suriya) – హరి (Hari) తీసిన మూడో ‘సింగం’ పరాజయం పాలైంది. అయితే ‘సింగం అగైన్’ను ఆ కథతో కాకుండా కొత్తగా రాసుకొని చేస్తున్నారు రోహిత్ శెట్టి మరి ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. అన్నట్లు పల్వంకర్ బాలూ కథ గురించి చెప్పలేదు కదా.. దళిత వర్గానికి చెందిన పల్వంకర్ పుణెలోని ఓ క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్స్‌మన్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
1896లో క్రీడా క్లబ్ హిందూ జింఖానా తరఫున క్రికెట్ ఆడేందుకు ఎంపికయ్యారు. అలా మొదలైన తన క్రికెట్ జీవిత ప్రయాణం మొదలైంది. ఈ క్రమంలో పల్వంకర్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు అనేది ఈ సినిమాలో చూపిస్తారట. ఈ బరువైన పాత్రకు అజయ్ అయితే కరెక్ట్ అని దర్శకుడు తిగ్మన్షు బలంగా నమ్ముతున్నారట.