ప్రముఖ తమిళ కథానాయకుడు, కొత్త రాజకీయ నాయకుడు విజయ్ తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి కళగం బహిరంగ సభ నిర్వహిస్తుండగా కరూర్ వద్ద తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే చాలామంది స్పందించారు. అయితే సినిమా పరిశ్రమ నుండి (రాజకీయాలతో టచ్ లేనివాళ్లు) ఎవరూ పెద్దగా స్పందించలేదు. ఇప్పుడు ప్రముఖ కథానాయకుడు అజిత్ తొలిసారి స్పందించాడు. ఇలాంటి పరిస్థితులకు కారణమేంటి, ఎవరు ఎలా ప్రవర్తించాలి లాంటి అంశాల గురించి మాట్లాడాడు.
Ajith
కరూర్ తొక్కిసలాట విషయంలో ఎవరినీ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు కానీ ఇలాంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. దీనికి మనందరమూ బాధ్యులమే. ముఖ్యంగా మీడియా వీటిపై అవగాహన కల్పించాలి అని అజిత్ వ్యాఖ్యానించాడు. కరూర్ తరహా గందరగోళ పరిస్థితులు సినిమా తారల సభల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.
క్రికెట్ మ్యాచ్ చూడడం కోసం వేల మంది మైదానానికి వెళ్తారు. సురక్షితంగా తిరిగొస్తారు కూడా. కానీ థియేటర్‌లో పరిస్థితి వేరుగా ఉంటోంది. అసలిలా ఎందుకు జరుగుతోంది? దీనివల్ల ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తోంది అని అజిత్ అన్నాడు. ఈ క్రమంలో తన వ్యక్తిగత విషయం కూడా చెప్పారు. తన పిల్లలు స్కూల్ దగ్గరికి రమ్మని అంటూ ఉంటారని.. కానీ ఎప్పుడూ వెళ్లలేదని చెప్పారు. తాను కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తే ఓ 60 మంది బైక్‌పై నన్ను ఫాలో అవుతారు. దీని వల్ల ఇతరులు ఇబ్బందిపడతారు. ఒక్కోసారి కారులో ఉండి ఫొటోలు ఇచ్చినప్పుడు నా చేతికి గాయాలైన సందర్భాలున్నాయని చెప్పారు.
ఈ క్రమంలో 2021లో తమిళనాడు ఎన్నికల సమయంలో వచ్చిన ఓ వార్త గురించి కూడా అజిత్ మాట్లాడాడు. ఓటు వేయడానికి వచ్చిన ఓ అభిమానిపై ఆగ్రహం వ్యక్తంచేశానని అప్పట్లో వార్త వచ్చింది. నిజానికి ఆ రోజు నేను, షాలిని ఓటు వేయడానికి వెళ్తే ఓ వ్యక్తి ఫొటోలు తీశాడు. ఆ తర్వాత పోలింగ్ రూమ్‌లోకి అనుమతి లేదన్నా వినకుండా ఫొటోలు తీశాడు. దీంతో అతడి ఫోన్ తీసుకొని సిబ్బందికి ఇచ్చాను. ఆ వీడియో వైరల్ అయింది. దీంతో నేను ఆ అభిమానిపై ఆగ్రహం వ్యక్తం చేశానని రాసేశారు. ఆ వార్తలు చూసి షాకయ్యాను అని అజిత్ చెప్పాడు.