‘మల్లిగాడు’ (తమిళంలో పరుత్తి వీరన్) సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసినా… కార్తి అంటే మొత్తం దక్షిణాదికి తెలిపిన చిత్రం ‘యుగానికి ఒక్కడు’. అదేనండి తమిళంలో ‘అయిరాతిల్ ఒరువన్’. దక్షిణాది నుంచి అలాంటి వైవిధ్యమైన సినిమా వస్తుందని ఎవరూ ఊహించని రోజుల్లో వచ్చి ఒక ఊపు ఊపేసింది. సాధారణ సినిమాలకు దూరంగా రూపొందిన సినిమాలో కార్తి నటనకు మంచి ప్రశంసలు, పురస్కారాలు దక్కాయి. దర్శకుడు సెల్వ రాఘవన్‌కు పేరొచ్చిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేయాలని దర్శకుడు చూస్తున్నాడట.
తమిళనాడులో థియేటర్లు రీఓపెన్ అయిన సందర్భంగా ‘అయిరాతిల్ ఒరువన్’ సినిమాను రీరిలీజ్‌కు చేశారు. 2010లో వచ్చిన ఈ సినిమాలో కార్తి, ఆండ్రియా, రీమా సేన్ ప్రధాన పాత్రల్లో నటించారు. 11 ఏళ్ల క్రితం సినిమాకు వచ్చిన ప్రశంసలు… ఇప్పుడూ కంటిన్యూ అవుతున్నాయట. అప్పుడు సినిమా చూడని వారు వావ్ అంటుంటే, అప్పుడు సినిమా చూసినవాళ్లు మళ్లీ చూసి మురిసిపోతున్నారట. సెల్వ రాఘవన్ దర్శకత్వ ప్రతిభను, కార్తి నటనను చూసి తెగ పొగిడేస్తున్నారట. ఈ క్రమంలో సినిమా సీక్వెల్ ఆలోచన బయటకు వచ్చిందట.
ఈ నేపథ్యంలో దర్శకుడితో ‘మీరు సినిమాను చాలా అడ్వాన్స్ గా ఆలోచించి తీశారు. దయచేసి సినిమాకు సీక్వెల్ తీయొచ్చు కదా’ అని కోరారట. దానికి సెల్వ రాఘవన్ కూడా తీస్తానని మాటిచ్చినట్లు సమాచారం. గతంలోనూ ఈ సినిమా సీక్వెల్ మాటలు చెవిన పడ్డాయి కానీ సాధ్యం కాలేదు. ఇప్పుడైనా సెల్వ రాఘవన్ – కార్తి కాంబోలో సీక్వెల్ వస్తుందేమో చూడాలి. ఇప్పుడు కానీ ఈ సినిమా వస్తే కచ్చితంగా పాన్ ఇండియా రేంజిలో తీస్తారనడంలో అతిశయోక్తి లేదు.