సినిమా చూడాలంటే టికెట్ ఉంటే సరిపోతుంది.. అదే టికెట్‌తో పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వం చల్లని చూపు కూడా ఉండాలి అంటే.. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. థియేటర్ల దగ్గర ప్రభుత్వ అధికారులు వచ్చి.. సినిమాను ఆడించడం చూశారా? అది కూడా వాళ్ల కనుసన్నల్లో. ఇలాంటి పరిస్థితి గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేది. అయితే తర్వాత తగ్గింది అనుకోండి. అయితే ఈ పరిస్థితి ఒక హీరోకు మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ హీరో అక్కడ డిప్యూటీ సీఎం.
అయినా, ఇప్పుడు అంతా అయిపోయింది కదా.. పాత విషయం ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు అంటే వచ్చే నెల సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు సందర్భంగా ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు కాబట్టి. ఎన్నో అడ్డంకులతో ఓ ఐదేళ్లు పవన్ కల్యాణ్ సినిమాలు వేసిన థియేటర్లు, చూసిన జనాలు ఇప్పుడు ఎంతో హాయిగా సినిమా చూసే అవకాశం వచ్చింది అనే చర్చ నడుస్తుండటమే దీనికి కారణం.
పుట్టిన రోజు సందర్భంగా హీరోల సినిమాల పోస్టర్లు, పాటలు, వీడియోలు రిలీజ్ అయ్యేవి. అయితే ఇప్పుడు పాత సినిమా, గతంలో వచ్చిన బాగా ఆడని సినిమా, ఆడిన సినిమాలు రిలీజ్ చేయడం ఇప్పుడు ట్రెండ్. ఇటీవల ‘మురారి’ (Murari) కూడా అలానే రిలీజ్ అయింది అనుకోండి. ఈ క్రమంలో ఆ సినిమా రికార్డులను తిరగరాయాలని ‘గబ్బర్ సింగ్’ను తీసుకొస్తున్నారు. ఈ మాట మేం అనడం లేదు.. అభిమానులే అంటున్నారు.
గత ఐదేళ్లలో గమ్మున ఉన్న అభిమానులు ఇప్పుడు డిప్యూటీ సీఎం తాలూకా అనే ధైర్యంతో, అభిమానంతో సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని, చూడాలని ఫిక్స్ అయ్యారు. మరి ‘గబ్బర్ సింగ్’ ఏ స్థాయిలో రిలీజ్ అవుతుందో చూడాలి. ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) పనులు అయ్యాక హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా ఈ సినిమా ప్రచారంలో చురుగ్గా పాల్గొంటారు అని కూడా అంటున్నారు.