బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ (Vicky Kaushal) నటించిన ‘ఛావా’ (Chhaava) ఇప్పుడు హిందీ బాక్సాఫీస్‌ను ఊపేస్తోంది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా, ప్రేక్షకుల్లో దేశభక్తిని రగిలిస్తోంది. థియేటర్లలో పిల్లల నుంచి పెద్దల వరకు భావోద్వేగంతో కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉత్తరాదిలో సినిమా ఫీవర్ ఏ స్థాయిలో ఉందంటే, థియేటర్ల వద్ద గుర్రాలపై వచ్చిన అభిమానులు, శివాజీ వేషధారణలో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. విక్కీ కౌశల్ తన నటనతో శంభాజీ పాత్రలో ప్రాణం పోసాడు.
గతంలో ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ సినిమాతో తన స్థాయిని పెంచుకున్న విక్కీ, ‘సామ్ బహదూర్’ లాంటి బయోపిక్స్‌తో రీల్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ‘ఛావా’ అతని కెరీర్‌లోనే బిగ్ హిట్‌గా నిలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి, విక్కీని బాలీవుడ్ టాప్ లైన్ యంగ్ హీరోల జాబితాలోకి తీసుకువచ్చింది. అయితే, ఈ సినిమా అన్ని భాషల్లో డబ్ చేయకపోవడం పెద్ద మైనస్‌గా మారింది. దక్షిణాదిలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో విడుదల చేసి ఉంటే, మరింత పెద్ద హిట్ అయ్యేది.
ముఖ్యంగా టాలీవుడ్‌లో ఈ సినిమాకు పకడ్బందీగా ప్రమోషన్ చేస్తే, బాహుబలి (Baahubali) తరహా స్పందన రావడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి సినిమాలను కచ్చితంగా అందుబాటులోకి తీసుకువచ్చే నిర్మాత అల్లు అరవింద్ ఈ సారి ఈ చాన్స్‌ను ఎందుకు వదిలేశారో అనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ‘గజిని’, ‘కాంతార’ వంటి సినిమాలను తెలుగులో ప్రాముఖ్యతనిచ్చిన అల్లు అరవింద్ (Allu Aravind) ఈసారి ఎందుకు ఈ సినిమాను పట్టించుకోలేదన్నది అందరికీ డౌట్.
బహుశా ‘పుష్ప 2’ (Pushpa 2) వివాదాలు, ఇతర ప్రాజెక్ట్స్‌లో బిజీగా ఉండటం వల్లే ఈ అవకాశం మిస్సయ్యారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే బాలీవుడ్ నిర్మాతలు కూడా తెలుగు రిలీజ్ పై అంతగా ఫోకస్ చేయలేదని తెలుస్తోంది. మొత్తానికి, తెలుగు ప్రేక్షకులు ‘ఛావా’ సినిమాను మిస్ అవుతున్నారనేది నిజం. కానీ, ఈ సినిమా సక్సెస్ ను చూసిన తర్వాత నిర్మాతలు దక్షిణాది భాషల్లో రిలీజ్ చేయడానికి ఆలోచిస్తారనే ఆశ ఉంది. మరి, తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమాను చూపించే ఆ హక్కులను ఎవరు దక్కించుకుంటారో చూడాలి.