‘సరైనోడు’.. అల్లు అర్జున్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ మాస్ హిట్స్‌లో ఒకటి. బన్నీని 100 కోట్ల క్లబ్‌లో నిలబెట్టిన ఈ సినిమా తర్వాత, బోయపాటి శ్రీనుతో మరో సినిమా ఉంటుందని నిర్మాత అల్లు అరవింద్ అప్పుడే ప్రకటించారు. ఆ ఒప్పందం ఇప్పటికీ ఉంది. కానీ, ఆ ప్రకటన వచ్చినప్పటి బన్నీకి, ఇప్పటి బన్నీకి మధ్య సముద్రమంత తేడా వచ్చింది. ‘పుష్ప’, ‘పుష్ప 2’ చిత్రాలు అల్లు అర్జున్‌ను ‘స్టైలిష్ స్టార్’ నుంచి ‘ఐకాన్ స్టార్’గా, పాన్ ఇండియా హీరోగా మార్చేశాయి. ఆయన మార్కెట్ ఇప్పుడు కేవలం తెలుగుకే పరిమితం కాలేదు, దేశవ్యాప్తంగా విస్తరించింది.
Allu Arjun
ప్రస్తుతం అల్లు అర్జున్ లైనప్ చూస్తే ఆయన ప్లానింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. ‘జవాన్’ ఫేమ్ అట్లీతో ఒక భారీ గ్లోబల్ ప్రాజెక్ట్‌కు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి టైమ్‌లో, ఆయన తిరిగి బోయపాటి శ్రీను వైపు చూస్తాడా అన్నదే పెద్ద ప్రశ్న. బోయపాటి ఒక మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్ అనడంలో సందేహం లేదు, కానీ ఆయనకు ఇప్పటివరకు డైరెక్ట్ పాన్ ఇండియా హిట్ లేదు. ఆయన మార్క్ మాస్ ఎలిమెంట్లు తెలుగు ప్రేక్షకులకు నచ్చుతాయి, కానీ అవే నార్త్ ఆడియన్స్‌కు కనెక్ట్ అవ్వకపోవచ్చు. బన్నీ ఇప్పుడున్న పాన్ ఇండియా ఇమేజ్‌కు, బోయపాటి ‘లోకల్’ మాస్ స్టైల్ సరిపోతుందా అనేది అసలు సమస్య.
ఈ మొత్తం వ్యవహారం ఇప్పుడు బోయపాటి తీస్తున్న ‘అఖండ 2’ ఫలితంపై ఆధారపడి ఉంది. ‘అఖండ’ మొదటి భాగానికి ఓటీటీ, డబ్బింగ్ రూపంలో నార్త్‌లో మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ‘అఖండ 2’ను బోయపాటి చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. అఘోరా పాత్ర, కుంభమేళా నేపథ్యం వంటివి కచ్చితంగా నార్త్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలు. డిసెంబర్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా, బోయపాటి స్టామినాకు అసలైన పాన్ ఇండియా టెస్ట్. ఇది కేవలం బాలయ్య సినిమా కాదు, ఇది బోయపాటి భవిష్యత్తును నిర్ణయించే ప్రాజెక్ట్.
ఒకవేళ ‘అఖండ 2’ పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించి, బోయపాటి కూడా నేషనల్ లెవెల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుంటే, అప్పుడు బన్నీనే స్వయంగా బోయపాటి దగ్గరకు వస్తాడు. అట్లీతో గ్లోబల్ సినిమా చేసినా, ‘సరైనోడు’ లాంటి పక్కా నేటివ్ మాస్ ఎంటర్‌టైనర్ చేయాలనే ఆలోచన ప్రతీ స్టార్‌కు ఉంటుంది. కానీ, ‘అఖండ 2’ కేవలం తెలుగు హిట్‌గా మిగిలితే, పాన్ ఇండియా స్టార్ అయిన బన్నీ.. బోయపాటితో రిస్క్ చేసే అవకాశం దాదాపు లేనట్లే.