ఒక హీరో స్టేజ్ మీద నేను ఫలానా వ్యక్తి ఫ్యాన్ అని చెప్పుకోవడం కేవలం పెద్ద పెద్ద ఆడియో వేడుకల్లో చూసి ఉంటాం. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అల్లు అర్జున్ చెప్పుకున్నా, నేను చిరంజీవి ఫ్యాన్స్ అని పవన్ కళ్యాణ్ చెప్పుకున్నా, నేను బాలయ్య ఫ్యాన్ అని రామ్ చెప్పుకున్నా.. వాళ్ళందరూ యంగ్ హీరోలు తమ సీనియర్ల గురించి మాట్లాడిన మాటలు. అయితే.. నిన్న సాయంత్రం జరిగిన “క” ప్రీరిలీజ్ ఈవెంట్లో జరిగిన విషయం మాత్రం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది.
Kiran Abbavaram
ఎందుకంటే.. స్థాయిలో కానీ, వయసులో కానీ తనకంటే చాలా చిన్నవాడైన కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) సినిమా వేడుకకు గెస్ట్ గా వచ్చిన నాగచైతన్య “నేను కిరణ్ అబ్బవరం నెం.1 ఫ్యాన్” అని చెప్పడం మామూలు విషయం కాదు. ఆల్రెడీ సినిమా మీద మంచి అంచనాలు ఉండగా, నాగచైతన్య లాంటి హీరో ఇచ్చిన ఈ స్టేట్మెంట్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ముఖ్యంగా కిరణ్ అబ్బవరం ఎదుర్కొన్న ట్రోల్స్ గురించి నాగచైతన్య (Naga Chaitanya) మాట్లాడుతూ.. “ట్రోల్ చేసేవాళ్ల చేతిలో కేవలం ఫోన్ ఉంటుంది, వాళ్లకి బ్రెయిన్ ఉండదు, వాళ్లకి భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు” అనడం ఈవెంట్ కి మరో హైలైట్ గా నిలిచింది.
కిరణ్ అబ్బవరం సరసన నయన్ సారిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి సందీప్ & సుజీత్ ద్వయం దర్శకత్వం వహించారు. అక్టోబర్ 31న తెలుగులో, నవంబర్ 7న తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్న ఈ సినిమాపై ఇప్పటివరకు మంచి అంచనాలే ఉన్నాయి.
మరి సినిమా ఏస్థాయిలో ఉంటుందో, కిరణ్ అబ్బవరంకి కథానాయకుడిగా పూర్వ వైభవం మరియు నిర్మాణ భాగస్వామిగా మంచి లాభాలు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి. ఎందుకంటే.. అదేరోజున తెలుగులోనూ కిరణ్ కి “లక్కీ భాస్కర్, అమరన్”ల ద్వారా భారీ పోటీ ఉంది.