1986లో ఓ తమిళ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన అమల పుష్పక విమానం, శివ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మసులు గెలుచుకున్నారు. తర్వాతగా తన మనసు నాగార్జున గెలుచుకోవడంతో 1992లో ఆయన్ను వివాహం చేసుకుని సినిమాలకి దూరమయ్యారు. శేఖర్ కమ్ముల పట్టుబట్టడంతో 2012లో వచ్చిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాలో తళుక్కున మెరిసిన ఈ నటి ఇప్పుడు ఓ మలయాళ సినిమాలో నటించనున్నారు.ఆంటోనీ సోనీ సెబాస్టియన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ‘కేరాఫ్ సైరాభాను’ చిత్రంలో అమల న్యాయవాదిగా నటించనున్నారు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్ పోస్ట్ వుమెన్ గా ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తొలుత ఆ న్యాయవాది పాత్రకు మలయాళ నటుడు జయసూర్య పేరు వినిపించిన కడకు అమలని ఒప్పించాడట దర్శకుడు.
1991లో మలయాళ హీరోలు సురేష్ గోపి, మోహన్ లాల్ లకు జంటగా రెండు సినిమాలు చేసిన అమల సుమారు పాతికేళ్ల తర్వాత మళ్ళీ మలయాళ సీమకి వెళ్లనుండటం విశేషం.దర్శకుడి విషయానికొస్తే.. ప్రముఖ మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ వద్ద అసోసియేట్ గా చేసిన ఆంటోనీ రెండు లఘు చిత్రాలకు దర్శకత్వం వహించాడు. మోలీవుడ్ లో దర్శకుడిగా రోషన్ కి మంచి పేరుంది. విభిన్న కథలతో సినిమాలు చేసి వరుసగా మూడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు సైతం గెలుచుకున్న రోషన్ హీరోయిన్ గా రిటైర్ అయిన మంజు వారియర్ ను ‘హౌ ఓల్డ్ ఆర్ యు’ సినిమాతో మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు. ఇదే సినిమాని ’36 వయధినిలే’ పేరుతో తమిళంలో రీమేక్ చేసి జ్యోతిక రీ ఎంట్రీకి శుభం కార్డు వేసింది ఈయనే. త్వరలో కమల్ తోనూ రోషన్ ఓ సినిమా చేయనున్నారు. అలాంటి దర్శకుడి శిష్యుడు కావడంతో ఆంటోనీ సినిమాపై మల్లు బాబులకు ఆసక్తి మొదలైంది.