2014లో కాశ్మీర్ లో ఓ స్పెషల్ ఆపరేషన్ లో వీరమరణం పొంది, భారతదేశపు అత్యున్నత పురస్కారమైన అశోక చక్రతో గౌరవించబడ్డ గొప్ప సైనికుడు తమిళనాడుకు చెందిన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తమిళంలో తెరకెక్కిన చిత్రం “అమరన్” (Amaran). శివకార్తికేయన్ (Sivakarthikeyan), సాయిపల్లవి (Sai Pallavi) ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని కమల్ హాసన్ (Kamal Haasan) నిర్మించడం విశేషం. తెలుగులో ఇదే తరహా కథతో ఆల్రెడీ “మేజర్” సినిమా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. మరి ఈ “అమరన్” కూడా అదే స్థాయిలో ఆకట్టుకుందో లేదో చూద్దాం..!!
Amaran Review in Telugu
కథ: నిజానికి ఇది ముకుందన్ వరదరాజన్ కథ కాదు, ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీసీ కథ. ముకుందన్ పుట్టిన ఏడు నెలలకి పుట్టిన ఇందు.. అతడితో ఏడడుగులు వేసి, అతడి మరణానంతరం కూడా ఏడు జన్మల బంధం సాక్షిగా అతడి ఊహల్లోనే బ్రతికింది. సిన్సియర్ ఆర్మీ మేజర్ అయిన ముకుందన్ (శివకార్తికేయన్)తో టీచర్ ఇందు (సాయిపల్లవి) ప్రయాణమే “అమరన్” (Amaran) చిత్రం.
నటీనటుల పనితీరు: సాయిపల్లవి ఓ సంపూర్ణమైన నటి అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే.. ఈ సినిమాలో ఆమె నటనకి ఆమెపై అభిమానంతోపాటు గౌరవం పెరుగుతుంది. ముఖ్యంగా తన భర్త మరణించాడు అని తెలిసిన తర్వాత పెల్లుబికిన బాధను నియంత్రించుకొని.. భర్తకు ఇచ్చిన మాట కోసం తన భావోద్వేగాలను మునిపంట బిగబెట్టి స్తబ్దతను చూపిన విధానం నటిగా ఆమె ఏ స్థాయిలో పరిణితి చెందింది అనేందుకు సరైన ఉదాహరణ. ఈ సినిమాకి ఆమెకు కచ్చితంగా ఉత్తమ నటి పురస్కారాలు వరించడం ఖాయం.
శివకార్తికేయన్ పడిన కష్టం, ముకుందన్ బాడీ లాంగ్వేజ్ లో ఇమిడిపోవడానికి అతడు తీసుకున్న జాగ్రత్త అభినందనీయం. ఆర్మీ చీఫ్ గా రాహుల్ బోస్ (Rahul Bose) , సహ సైనికుడిగా భువన్ అరోరా (Bhuvan Arora) బాధ్యతగల పాత్రల్లో మెప్పించారు. తల్లి పాత్రలో గీతా కైలాసం నటన మనసుల్ని తడుముతుంది.
సాంకేతికవర్గం పనితీరు: “షేర్ షా, మేజర్” లాంటి సినిమాల విడుదల తర్వాత ఇంచుమించుగా అదే స్థాయి కథనంతో వస్తున్న “అమరన్” ఆడియన్స్ ను ఆకట్టుకోవడం కష్టమే అని దాదాపుగా అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే.. ఆ రెండు సినిమాలకు భిన్నంగా హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలో కథను నడిపి కొత్తదనం యాడ్ చేశాడు సినిమాకి. అలాగే.. ఫ్యామిలీ ఎమోషన్స్ ను అద్భుతంగా పండించాడు. సాధారణంగా ఈ తరహా ఆర్మీ థీమ్ సినిమాలు చాలా గాంభీరంగా ఉంటాయి. కానీ.. రాజ్ కుమార్ పెరియస్వామి (Rajkumar Periasamy) అక్కడే తన పనితనాన్ని చూపి ఆరోగ్యకరమైన హాస్యాన్ని, అద్భుతమైన ఎమోషన్స్ ను కథలో భాగం చేసి ప్రేక్షకుల్ని పూర్తిస్థాయిలో సినిమాలో లీనమయ్యేలా చేశాడు.
కాశ్మీర్ అంశాలను ఇంకాస్త సెన్సిబుల్ గా డీల్ చేస్తే బాగుండు అనిపించింది. కథకి ఎంతో కీలకమైన ఆ అంశాలను పెద్ద సీరియస్ గా చూపించలేదు దర్శకుడు. అందువల్ల ముకుందన్ కథ ఓ బయోపిక్ గా కంటే ఓ కమర్షియల్ డ్రామాగా కనిపిస్తుంది. ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఉంటే కచ్చితంగా “అమరన్” ఓ క్లాసిక్ గా మిగిలిపోయేది. అయితే.. ఆ మైనస్ పాయింట్స్ ను క్లైమాక్స్ లో సాయిపల్లవి పెర్ఫార్మెన్స్ కవర్ చేసింది అనుకోండి. సి.హెచ్.సాయి (Ch Sai) సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. సన్నివేశంలోని మూడ్ కు తగ్గట్లు టైట్ క్లోజ్ షాట్స్ & లైటింగ్ ను మ్యానేజ్ చేసిన తీరు ప్రేక్షకులకు ఓ మంచి అనుభూతినిచ్చింది.
జి.వి.ప్రకాష్ కుమార్ (G. V. Prakash Kumar) పాటలు వినసొంపుగా ఉండగా.. నేపథ్య సంగీతంతో మాత్రం మ్యాజిక్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్ టీమ్ ఎఫర్ట్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆల్మోస్ట్ అన్నీ రియల్ లొకేషన్స్ లో సినిమా షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆ విషయంలో మాత్రం కమల్ హాసన్ & సోనీ పిక్చర్స్ నిర్మాణ పాఠవాలను మెచ్చుకోవాలి. అలాగే.. ఆర్ట్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి విషయంలో చాలా రీసెర్చ్ చేసి, ఆర్మీ బ్యాడ్జ్ మొదలుకొని గన్స్ వరకు ప్రతి విషయంలో సహజత్వం ఉండేలా జాగ్రత్త తీసుకున్నారు.
విశ్లేషణ: ముగింపు ముందుగానే తెలిసినా ఆ ప్రయాణం కోసం చివరివరకు ప్రేక్షకుడిని కుర్చీ నుండి కదలనీయకుండా చేసిన సినిమా “అమరన్” . ముందు చెప్పినట్లుగా ఇది ముకుందన్ కథ కాదు, ఆయన సతీమణి ఇందు రెబెకా వర్గీసీ కథ. శివకార్తికేయన్ కంటే సాయిపల్లవి ఎక్కువ మార్కులు సంపాదించుకుంది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరైతే కారణం సాయిపల్లవి నటన అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఫోకస్ పాయింట్: ఆర్మీ కుటుంబాల మనోగతాన్ని మహోన్నతంగా చూపించిన “అమరన్”.