తెలుగులో తక్కువ సంఖ్యలో సినిమాల్లోనే నటించినా అమిత్ తివారి నటుడిగా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు. త్రివిక్రమ్ సినిమాల ద్వారా అమిత్ తివారీకి మరింత మంచి పేరు వచ్చింది. తాజాగా అలీతో సరదాగా షోకు హాజరైన అమిత్ ఇండస్ట్రీకి వచ్చి 18 సంవత్సరాలు పూర్తైందని ముంబైలో నటన, డ్యాన్స్ కు సంబంధించి ట్రైనింగ్ తీసుకున్నానని తెలిపారు. తనది లవ్ మ్యారేజ్ అని అమిత్ వెల్లడించారు. మా నాన్నమ్మది హైదరాబాద్ కాగా తాతది యూపీ అని అమిత్ అన్నారు.
నాన్నమ్మ, తాతయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఇంట్లో కుల మతాల పట్టింపు లేదని అమిత్ అన్నారు. విక్రమార్కుడు సినిమా ఎఫెక్ట్ తో ఆ తర్వాత కూడా తనకు అలాంటి పాత్రలే వచ్చాయని అమిత్ చెప్పుకొచ్చారు. గుణ్ణం గంగరాజు భార్య ఊర్మిళ, దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి వల్ల తనకు రాజమౌళితో పరిచయం ఏర్పడిందని ఆయన అన్నారు. రాజమౌళిని సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని కోరగా విక్రమార్కుడు సినిమాలో ఛాన్స్ ఇచ్చారని ఆయన చెప్పుకొచ్చారు.
రాజమౌళితో కలిసి సుదర్శన్ 70ఎం.ఎంలో విక్రమార్కుడు సినిమా చూశానని సినిమాలో తనకు ఉరి పడే సీన్ వచ్చినప్పుడు ముందు కూర్చున్న ఆడియన్స్ చిప్స్ ముందుకు విసిరేసి చెప్పలేని తిట్లు తిట్టారని అమిత్ అన్నారు. రాజమౌళి వాళ్లు నిన్ను తిడుతున్నారంటే నీ పాత్ర బాగా వచ్చిందని అర్థమని చెప్పారని అమిత్ పేర్కొన్నారు. అన్ని భాషల్లో కలిపి 200 సినిమాలు చేశానని కన్నడ, బెంగాళీలో మాత్రం చేయలేదని అమిత్ వెల్లడించారు.
స్టాలిన్ సినిమాకు డబ్బింగ్ చెప్పే సమయంలో మేకప్ మేన్ చిరంజీవి గారు పిలిచారని చెప్పిన వెంటనే తనకు చెమటలు వచ్చాయని చిరంజీవి గారు పిలిచి విక్రమార్కుడు సినిమాలో తన నటనను మెచ్చుకున్నారని అమిత్ పేర్కొన్నారు. చిరంజీవి గారి ఆశీర్వాదాలు నాకు అవార్డులు అని ఆయన అలా చెప్పడంతో తాను నాలుగు రోజుల పాటు నిద్రపోలేదని అమిత్ చెప్పుకొచ్చారు. అమిత్ విలనిజంకు తెలుగులో భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. అమిత్ నటుడిగా మరింత సక్సెస్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.