Amrutham Serial: మరోసారి రిలీజ్‌కి రెడీ అయిన కల్ట్‌ కామెడీ సీరియల్‌… ఒక తరానికి ఎమోషన్‌

ఇప్పుడంటే యూట్యూబ్‌లు, ఓటీటీలు సిరీస్‌లు, డైలీ సీరియల్స్‌ వచ్చేశాయి కానీ.. ఒకప్పుడు అంతా వీక్లీ సీరియల్స్‌ యుగమే. వారానికో ఎపిసోడ్‌ రిలీజ్‌ చేసేవారు. దానిని రెండో రోజు వీలైతే రీటెలీకాస్ట్‌ చేసేశారు. అలాంటి యుగంలో ట్రెండ్‌ సెట్టర్‌, కల్ట్ సీరియల్‌ అనిపించుకున్న సీరియల్స్‌లో అమృతం ఒకటి. ఆఖరిగా ఇలాంటి కల్ట్‌ హోదాను అందుకున్న కామెడీ సీరియల్‌ అయితే ఇదే. ఇప్పటికీ షార్ట్స్‌, రీల్స్‌లో ఆ వీడియోలు చూసి నవ్వుకోని వారుండరు. ఇప్పుడెందుకు ఈ సీరియల్‌కి ఈ ఎలివేషన్‌ అనుకుంటున్నారా? ఉంది మరి కారణం ఉంది.

Amrutham Serial

మరోసారి తెలుగు సీరియల్‌ ప్రేక్షకులు యాక్టివేట్‌ అవ్వాల్సిన సమయం వచ్చింది. ‘ఒరేయ్ ఆంజనేలూ.. తెగ ఆయాస పడిపోకు చాలు.. మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు’ అంటూ అమృతం రాబోతున్నాడు. ఆయనతోపాటు అప్పాజీ, సర్వం కూడా వచ్చేస్తున్నారు. ఆ సీరియల్‌ కొనసాగింపు వస్తోంది అనుకునేరు. ఆ సీరియల్‌ని రీటెలీకాస్ట్‌ చేయబోతున్నారు. యూట్యూబ్‌లో ‘అమృతం సీరియల్‌’ పేరుతో ఓ ఛానెల్‌ తీసుకొచ్చారు. నవంబర్‌ 24 నుండి రోజూ రెండు ఎపిసోడ్‌లు విడుదల చేయనున్నారు.

ఈ సీరియల్‌లో టైటిల్‌ పాత్రలో అమృతరావుగా మొదట్లో శివాజీ రాజా నటించగా, ఆ తర్వాత నరేశ్‌ ఆ పాత్రను పోషించారు. కొన్నేళ్ల తర్వాత హర్షవర్ధన్‌ టైటిల్‌ పాత్రలోకి వచ్చారు. గుండు హనుమంతురావు, రాగిణి, వాసు ఇంటూరి ఇతర కీలక సహాయ పాత్రలు పోషించారు. అయితే అప్పటి సీరియల్‌ను యథాతథంగా తెచ్చేయకుండా పాత సినిమాలను రీమాస్టర్ చేసి రీ రిలీజ్ చేస్తున్నట్లు.. ఈ సీరియల్‌ని కూడా నేటితరానికి నచ్చేలా క్వాలిటీలో మార్పులు చేసి తెస్తున్నారు.

ఈ సీరియల్ విషయానికొస్తే అప్పట్లో అంటే 2001 నుండి ఆరేళ్లు టెలీకాస్ట్ అయింది. అన్ని ఎపిసోడ్సూ ప్రేక్షకులకు నచ్చాయి అంటే అర్థం చేసుకోవచ్చు. అన్నట్లు ఈ సీరియల్‌లో ప్రస్తుతం సినిమా పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న టెక్నీషియన్లు కొందరు అక్కడక్కడా కనిపిస్తారు. రాజమౌళి భార్య, ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ రమా రాజమౌళి కూడా ఉంటారు.

ఎన్టీఆర్ నీల్.. బీస్ట్ మోడ్‌ మొదలైందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus