జంధ్యాల తరువాత వెండితెర హాస్యాన్ని ముందుకు తీసుకెళ్లిన దర్శకులలో ఎస్ వి కృష్ణా రెడ్డి ఒకరు. ఎమోషన్ ని హాస్యాన్ని కలగలిపి సినిమా తెరకెక్కించడం ఆయన ప్రత్యేకత. ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్ మరియు సున్నితమైన హాస్యం నడుపుతూ, కథలో లీనమయ్యే విధంగా కమెడియన్స్ సెపెరేట్ ట్రాక్స్ తో ఎస్ వి కృష్ణారెడ్డి పొట్టపగిలేలా నవ్వించేవాడు. ఫ్యామిలీ మొత్తం కలిసి చూడదగిన సినిమాలకు ఆయన చిత్రాలు చిరునామా. బూతు హాస్యం, జుగుప్త్సకర కంటెంట్ ఆయన సినిమాలలో భూతద్దం పెట్టి వెతికినా దొరకదు.
ఆరోగ్యకరమైన హాస్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన సినిమాలు ఉంటాయి. తన చిత్రాలకు కథ, స్క్రీన్ ప్లే, సంగీతం ఆయనే అందించేవారు. ఓ చిత్రానికి ఇన్ని శాఖలకు పనిచేసే అరుదైన దర్శకులలో ఎస్ వి ఒకరు. పరిశ్రమకు పరిచయమైన కొత్తలో ఆయన హీరోగా ఓ సినిమా చేశారు. ఆ చిత్రం విడుదల కాలేదు. తరువాత రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన కొబ్బరిబోండం చిత్రానికి కథ, మ్యూజిక్ అందించారు. ఇక 1993లో వచ్చిన మాయలోడు సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. మొదటి సినిమాకే దర్శకత్వంలో పాటు మ్యూజిక్, స్టోరీ, స్క్రీన్ ప్లే ఆయన అందించారు.
గారడీ చేసి బ్రతికే ఓ సామాన్యుడు ఓ అనాథ పసిపాప కోసం పడిన పాట్లు, డీప్ ఎమోషన్స్ తో ఆయన తెరకెక్కించారు. కోట శ్రీనివాసరావు, బాబు మోహన్ కామెడీ ట్రాక్ తో పాటు, బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతుల కామెడీ నవ్వులు పండించింది. ఎస్ వి కృష్ణా రెడ్డి అందించిన అన్ని సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ అందుకోగా బాబు మోహన్ తో సౌందర్య డ్యూయట్ చినుకు చినుకు…సాంగ్ ఓ ప్రభంజనం. సౌందర్య అప్పుడప్పుడే హీరోయిన్ గా నిలదొక్కుకుంటుంది. ఎన్ని సార్లు చూసిన బోరుకొట్టకుండా ఆహ్లాదం పంచే సినిమాలలో ఒకటిగా మాయలోడు నిలిచిపోయింది.