సోషల్ మీడియాలో ట్రెండింగ్ కంటే ట్రోలింగ్ ఎక్కువగా ఫేస్ చేసిన బాలీవుడ్ నాయికల్లో అనన్య పాండే ఒకరు. ఆమె ఏం చేసినా ట్రోల్ చేసేస్తుంటారు నెటిజన్లు. ఏ డ్రెస్ వేసుకున్నా… ‘ఇదేం డ్రెస్సింగ్’ అంటూ ఉంటారు. అయితే తనను అంతగా ఇబ్బంది పెడుతున్నా అనన్య ఎప్పుడూ సోషల్ మీడియా వీడిపోలేదు. అంతే కాదు ఇప్పుడు ఏకంగా సోషల్ మీడియా ఉపయోగం గురించి ఓ వెబ్‌సిరీస్ రూపొందించే ప్రయత్నంలో ఉంది. సోషల్ మీడియా అనగానే చాలామంది యాంటీ కామెంట్స్ చేస్తుంటారు.
తప్పుడు వార్తలు, ట్రోలింగ్, ద్వేషం లాంటివే ఉంటాయి అనుకుంటూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో అంతకుమించి మంచి కూడా జరుగుతోంది అని చెబుతోంది అనన్య పాండే. అంతేకాదు కరోనా సమయంలో సమాజ సేవ చేసి… రియల్ హీరోలుగా నిలిచిన వారితో ఓ కార్యక్రమం నిర్వహించబోతోంది. సోషల్ మీడియా హీరోలతో ప్రత్యేకంగా ముచ్చటించనుంది. కరోనా సమయంలో సోషల్ మీడియాలో నేను మానవత్వాన్ని చూశాను. ఎటువంటి పరిచయం లేని వాళ్లకు సాయం చేయడం, అవసరమైన సమాచారం పంచుకోవడమనేది చాలా గొప్ప విషయం.
ఇలాంటి కొన్ని సందర్భాలు, అంశాలు సోషల్ మీడియాపై నాకు నమ్మకాన్ని కలిగించాయి. అందుకే ‘సోషల్ మీడియా ఫర్ సోషల్ గుడ్’ అనే ఒక సిరీస్ చేయాలని నిర్ణయించుకున్నాను అని సోషల్ మీడియాలో ప్రకటించింది అనన్య. తనను ఉత్తపుణ్యానికి ట్రోల్ చేసే సోషల్ మీడియా కోసం అనన్య పెద్ద పనే చేస్తోంది కదా.