హారర్ సినిమా అంటే మన సౌత్ లో తప్పకుండా కామెడీ ఉండాల్సిందే. లారెన్స్ పుణ్యమా అని అది ఒక యూనివర్సల్ ఫార్ములా అయిపొయింది. అందువల్ల సౌత్ ఇండస్ట్రీ నుంచి చక్కని హారర్ థ్రిల్లర్స్ వచ్చి చాలా ఏళ్లయ్యింది. అప్పుడెప్పుడో వచ్చిన నయనతార “మాయ” తర్వాత ఆస్థాయిలో అలరించిన చిత్రం “అంధకారం”. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ నిర్మించిన ఈ చిత్రం నవంబర్ 24న నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. విశేషమైన స్పందనలు అందుకుంటున్న ఈ చిత్రం కథ-కామీషూ చూద్దాం..!!
కథ: సూర్యం (వినోద్ కిషన్) ఓ అంధుడు. ఒక లైబ్రరీలో క్లర్క్ గా పని చేస్తూ, మరో ప్రక్క exams కి ప్రిపేర్ అవుతుంటాడు. ఇంద్రన్ (కుమార్ నటరాజన్) ఓ పేరు మోసిన సైకియాట్రీస్ట్ ఓ మతి చలించిన పేషెంట్ ద్వారా కాల్పులకు గురై బ్రతికి ప్రాణాలతో బయటపడతాడు. అందులో భాగంగా అతడి కుటుంబాన్ని సైతం కోల్పోతాడు. వృత్తిరీత్యా కొన్ని ఉద్వాసనలకు గురవుతాడు. వినోద్ (అర్జున్ దాస్) ఓ క్రికెట్ కోచ్ గా ఫెయిల్ అయ్యి ఓ విధమైన డిప్రెషన్ లో బ్రతుకును వెళ్లదీస్తుంటాడు. ముగ్గురికి వారి వారి సమస్యలు.వారి దైనందిన జీవితాన్ని సమూలంగా మార్చివేసే సమస్యలు, వారి జీవితాన్ని గాఢాంధకారంలోకి నెట్టివేస్తే అందులో భాగంగా ఆ ముగ్గురు ఏం చేశారన్నదే అసలు కథ.
నటీనటుల పనితీరు: “నా పేరు శివ”లో సైకో కుర్రాడిగా కనిపించిన వినోద్ కిషన్ ఈ చిత్రంలో అంధుడిగా అదరగొట్టాడు. అలాగే “ఖైదీ” ఫేమ్ అర్జున్ దాస్ ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నాడు. పూజా రామచంద్రన్ లోని నటిని పూర్తిస్థాయిలో వినియోగించుకున్న చిత్రమిది. అంత మంచి నటితో తెలుగులో చెత్త రోల్స్ ఎందుకు చేయిస్తున్నారో అర్ధం కావడం లేదు. అందరికంటే ఎక్కువగా ఆశ్చర్యపరిచింది మాత్రం కుమార్ నటరాజన్. డాక్టర్ ఇంద్రన్ పాత్రలో ఆయన సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క నటుడి నుంచి పాత్రకు, కథకు అవసరమైన నటనను రాబట్టుకున్న దర్శకుడు విజ్ఞరాజన్ కు హ్యాట్సాఫ్.
సాంకేతికవర్గం పనితీరు: మనిషి సృష్టి రహస్యమే అంధకారంలో నుండే మొదలవుతుంది అంటాడు ప్రముఖ రచయిత జయకాంతన్. మనిషిలోని మంచిచెడులకి, వెలుగుచీకట్లకు ఏదో తెలియని అవినాభావ సంబంధం ఉంటుంది.మంచిని వెలుగుతోను, చెడును చీకటితోను నిర్వచిస్తారు.యుగయుగాలుగా వెలుగుకి, చీకటికు జరిగే అంతర్యుద్ధంలో చీకటిదే పై చేయి అయినా కడకు దానిని వెలుగు మెలమెల్లగా అంతమోదిస్తుంది. ఈ సినిమా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. దానిని అట్లీ లాంటి ఒక కమర్షియల్ డైరెక్టర్ నే ప్రొడ్యూస్ చేయడం అన్నది కూడా ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది.వెరసి సినిమా మీద ఒకింత ఆసక్తిని, ఎదురుచూపును కలిగించాయి. కొన్ని సినిమాలు ట్రైలర్ లో ఇచ్చిన కిక్ ,సినిమా విషయానికి వచ్చే సరికి ఉండని సందర్భాలెన్నో. కానీ ఈ సినిమా నిజంగా అన్ని విధాలా ఆకట్టుకుంది.
సినిమా లెంగ్త్ విషయం ప్రక్కన పెట్టేద్దాం. కొన్ని కథలు చెప్పేందుకు, ఒక మూడ్ ని ఎలివేట్ చేసేందుకు ఆ టైప్ స్లో నేరేషన్ అన్నది అవసరమే.ఇది ఈ సినిమాకి అన్ని విధాలా వర్తిస్తుంది. సినిమాలో ప్రతి చిన్న విషయం చాలా పకడ్బందీగా చేసిన ఫీల్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్,ఎడిటింగ్, మ్యూజిక్, ఆర్ట్ వర్క్, కథ, కథనం,డైలాగ్స్ అన్నీ కూడా. రైటింగ్ పరంగా చాలా ఆసక్తిని రేకెత్తించింది ఈ సినిమా. ఆసాంతం ఉత్కంఠకు గురి చేస్తూ, లేయర్ బై, లేయర్ గా ఒక్కో విషయం రివీల్ అవుతూ వస్తుంది. అంతే కానీ కథకు మింగుడు పడని ఏ విన్యాసాలు లేవు ఆ 3 గంటల కథకి. తప్పక చూడవలసిన సినిమా.ఈ మధ్యకాలంలో చూసినవాటిలో బాగా నచ్చిన సినిమా.
దర్శకుడు విజ్ఞరాజన్ రాసుకున్న కథ, ఆ కథను తెరకెక్కించిన విధానం, కథను అల్లుకొని.. చివరి ముప్పై నిమిషాల్లో ఒక్కొక్కటిగా ప్రతి మెలికను విప్పిన తీరు అదిరిపోయాయి. ఒక చక్కని థ్రిల్లర్ కు కావాల్సిన అన్నీ అంశాలను సరైన మోతాదులో మేళవించి.. ప్రేక్షకులను రంజింపజేసాడు. సంగీత దర్శకుడు ప్రదీప్ కుమార్ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో సినిమాకి ఆయువుపట్టుగా నిలిచాడు. ఇక కెమెరా వర్క్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎడ్విన్ సకాయ్ కెమెరా ఫ్రేమ్ ప్రతీదీ అద్భుతమే. ఇలా అందరూ టెక్నీషియన్స్ ఎఫర్ట్స్ కలిసి “అంధకారం” ఓ అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.
విశ్లేషణ: వెకిలి నవ్వులు, అనవసరమైన కామెడీలు, చిరాకుపెట్టే హీరోయిన్ల ఎక్స్ పోజింగులు లాంటివి లేకుండా.. కేవలం కథ చుట్టూ మాత్రమే తిరిగే పారానార్మల్ థ్రిల్లర్ “అంధకారం”. ముఖ్యంగా స్క్రీన్ ప్లే మాత్రం అదిరిపోయింది. ఒక చక్కని సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం ఈ చిత్రాన్ని తప్పకుండా చూడాల్సిందే.