‘అవతార్’ సినిమా విడుదల సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయింది మీరు కూడా చేసి ఉంటారు. ఆ సినిమా టీమ్ చేసింది కాదు కానీ.. ఎవరో బయట వ్యక్తి చేసిన ఆ ఏఐ వీడియోలో ‘అవతార్’ హీరో జేక్ ఇండియన్ సినిమా స్టార్ హీరోలతో కలసి సెల్ఫీ దిగినట్లుగా ఆ వీడియోలో చూపించారు. ప్రతి హీరో దగ్గరకు వెళ్లి జేక్ సెల్ఫీ దిగుతాడు జేక్. ఆ ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. సినిమా ప్రచారం వెరైటీగా చేయడంలో స్టార్ అనిపించుకున్న అనిల్ రావిపూడి పట్టేశారు. అలాంటి వీడియోనే ఒకటి చేశారు.
చిరంజీవిని తాను తొలి నాళ్ల నుండి చూస్తున్నది.. ఇప్పుడు డైరెక్ట్ చేస్తున్నది తెలిపేలా ఆ వీడియోను రెడీ చేశారు. ‘ఖైదీ’, ‘గ్యాంగ్‌లీడర్’, ‘ఘరానా మొగుడు’, ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘ముఠామేస్త్రీ’, ‘అన్నయ్య’, ‘ఇంద్ర’, ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’, ‘ఠాగూర్’ సినిమా సెట్స్‌కు అనిల్ వెళ్లిన్నట్లు ఆ వీడియో రూపొందించారు. అందులో ఆఖరుగా ఆయన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా సెట్స్‌లో డైరెక్ట్ చేస్తున్నట్లు చూపించారు. దీంతో ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నేను చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగిన మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుండి ఇలా నేను డైరెక్ట్ చేసిన మెగాస్టార్ వరకు అందరితోనూ సెల్ఫీలు దిగాను. థాంక్స్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. టెక్నాలజీని ఇలా పద్ధతిగా కూడా వాడుకోవచ్చు అని ఆ వీడియోను షేర్ చేస్తూ రాసుకొచ్చారు అనిల్ రావిపూడి. ఈ వీడియో చూసిన చిరు ఫ్యాన్స్.. అనిల్ రావిపూడి డైరెక్టర్ డ్యూటీ దిగేసి ప్రమోషన్స్ హెడ్ కుర్చీ ఎక్కేశారు అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.
చిరంజీవి సరసన నయనతార నటిస్తున్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయబోతున్నారు. జనవరి తొలి వారంలో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఉంటుంది.