తెలుగులో రీమేక్ సినిమాలకు ఆదరణ బాగానే ఉంటుంది. అయితే ఒక్కోసారి తేడా కొడితే మాత్రం ఫలితం దారుణంగా ఉంటుంది. దీనికి రీసెంట్ ఉదాహరణలు చాలానే ఉన్నాయి. పెద్ద పెద్ద హీరోలు రీమేక్‌లు చేసి చేతులు కాల్చుకున్నారు. మా సినిమాకు రావాల్సినన్ని డబ్బులు వచ్చాయి అని నిర్మాతలు చెబుతున్నా… అవి గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఉన్నాయనేది ట్రేడ్ వర్గాల సమాచారం. ఇలాంటి సమయంలోనే డబ్బింగ్ రూపంలో వచ్చిన ఇతర భాషల సినిమాలు మంచి విజయాలు అందుకుంటున్నాయి.
ఇప్పుడెందుకు రీమేక్ – డబ్బింగ్ సినిమాల చర్చ అనుకుంటున్నారా? ఎందుకంటే మలయాళంలో ఓ స్టార్ హీరో సినిమా భారీ విజయం అందుకుంది కాబట్టి. అందులోనూ ఆయన సీనియర్ స్టార్ కాబట్టి. మీరు మలయాళ సినిమాలను ఫాలో వాళ్లయితే ఇప్పటికే మీకు అర్థమైపోయుంటుంది ఆ హీరో ఎవరో, ఆ సినిమా ఏంటో? అవును మలయాళ మెగాస్టార్ అయిన మమ్ముట్టి ప్రధాన పాత్రలో రూపొందిన ‘కన్నూర్ స్క్వాడ్’. ఈ సినిమా మాలీవుడ్‌లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.
‘కన్నూర్ స్క్వాడ్’ (Kannur Squad) సినిమా విడుదలకు ముందుగా పెద్దగా బజ్ ఏమీ లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా నెమ్మదిగానే జరిగాయి. అయితే మొదటి రోజు తర్వాత పరిస్థితి మారిపోయింది అంటున్నారు మలయాళ పరిశ్రమ ట్రేడ్ వర్గాల నిపుణులు. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. మమ్ముట్టి మాస్ మేనరిజం, క్లాసిక్ టచ్ ఉన్న యాక్షన్‌తో ఫ్యాన్స్ వావ్ అంటున్నారు. ఇందులో మమ్ముక్క జార్జ్ అనే పోలీసుగా కనిపించాడు.
కాసర్గోడ్ అనే ఊరిలో ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో జరిగిన దొంగతనం, హత్య కేసుని నలుగురు పోలీస్ ఆఫీసర్ల బృందం టేకప్ చేస్తుంది. విచారణ జరిపే కొద్దీ సవాళ్లు ఎదురవుతాయి. ప్రమాదాల్లో చిక్కుకుంటారు కూడా. అలాంటి పరిస్థితుల్లో కేసును ఎలా చేధించారు అనేదే కథ. రాబీ వర్గీస్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి ఆరు రోజుల్లో రూ.20 కోట్ల గ్రాస్ వసూలు చేసిందట. మొత్తంగా ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ. 40 కోట్లు దాటాయంట. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తారా? డబ్ చేస్తారా అనే చర్చ జరుగుతోంది.