మలయాళ సినిమాలకు ఇటీవల సమయంలో భారీ ఆదరణ దక్కుతోంది. అందులోనూ ప్రేమ, థ్రిల్లర్‌లకు ఎక్కువ ఆదరణ దక్కుతోంది. మలయాళంలోనే కాదు… తెలుగులో కూడా ఆ సినిమాలకు మంచి పేరు వస్తోంది. దాంతోపాటు డబ్బులు కూడా భారీగానే వస్తున్నాయి. ఇప్పుడు అలా మరో సినిమాను తెలుగులో రిలీజ్ చేసేయడానికి నిర్మాతలు సిద్ధం అవ్వొచ్చు. దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి పైన చెప్పిన విజయం కాగా, రెండోది ఆ కథ తెలంగాణ బేస్డ్ లవ్ స్టోరీ కాబట్టి.
కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమాలను కూడా బ్రహ్మరథం ఎక్కించడంలో మన సినిమా జనాలు సూపర్. అలా ఇప్పుడు మలయాళంలో వచ్చిన ‘ప్రేమలు’ అనే సినిమాను అంతెత్తున కూర్చోబెట్టే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పాలి. సుమారు రూ. మూడు కోట్లు బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఫిబ్రవరి 9న వచ్చింది. ఇప్పటికే రూ. 18 కోట్ల వసూళ్లు అందుకుంది. వారం తిరగకముందే ఇంత అందుకుంటోంది అంటే… ఫుల్ రన్‌లో ఎంతొస్తుందో అని లెక్కలేస్తున్నారు విశ్లేషకులు.
హైదరాబాద్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ లవ్ డ్రామాను గిరీష్ తెరకెక్కించారు. ఏదో సగటు మలయాళ సినిమాలా మొదటి రోజు పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చింది. అయితే మౌత్ టాక్ ద్వారా భారీ విజయం అందుకుంది అంటున్నారు. ఈ క్రమంలో సినిమా రూ. 50 కోట్ల వసూళ్లు అందుకోవడం పెద్ద కష్టం కాదని చెబుతున్నారు. ఇప్పటికే ఇలాంటి పేరుతోనే తెరకెక్కిన ‘ప్రేమమ్’ సినిమా విజయంతోపాటు హీరోయిన్లు కూడా మనకు తెగ నచ్చేశారు. కాబట్టి ‘ప్రేమలు’ (Premalu) ఏం చేస్తుందో చూడాలి.
ఇక ఈ సినిమా సంగతి చూస్తే… చదువులో బ్యాక్ లాగ్స్‌తో సతమతమయ్యే ఒక కుర్రాడు బ్రిటన్ వెళ్లి జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతో ఉంటాడు. అదే సమయంలో ఓ అమ్మాయి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కోసం హైదరాబాద్ వస్తుంది. ఆ తర్వాత ఇద్దరూ ఒక పెళ్లి సందర్భంలో కలుసుకుంటారు. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనేది సినిమా మెయిన్ పాయింట్.
అయితే దీనికి చాలా ఉప కథలు ఉన్నాయి. సంభాషణలు, భావోద్వేగాలు, హాస్యం ఈ సినిమాకు ప్లస్‌గా నిలుస్తాయి. ఇంత చెప్పి హీరో, హీరోయిన్ ఎవరో చెప్పకపోతే బాగోదు కదా.. హీరో నాస్లెన్ కె గఫూర్, హీరోయిన్ మమతా బైజు. ఇద్దరూ సహాయ పాత్రలు చేసినవాళ్లే. అన్నట్లు ఈ సినిమా నిర్మాత మన ‘పుష్ప’ విలన్ ఫహాద్ ఫాజిలే.