ఇండస్ట్రీకి ఏ నటుడు వచ్చినా.. హీరో అవుదామనేదే మొదటి టార్గెట్. అయితే.. సరైన అవకాశాలు రాక లేక పొట్ట నింపుకోవడం కోసం వచ్చిన పాత్రలన్నీ చేస్తూ వెళ్లిపోతారు. అలా హీరోగా రాణించడానికి కావాల్సిన అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నప్పటికీ.. విలన్ లేదా సపోర్టింగ్ రోల్స్ కి పరిమితమైన నటుడు శత్రు (Shatru). “లవ్ యూ బంగారం” సినిమాతో విలన్ గా పేరు సంపాదించుకున్న శత్రు అనంతరం “కృష్ణగాడి వీరప్రేమగాథ (Krishna Gaadi Veera Prema), అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava)” వంటి సినిమాలతో మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు.
లాక్ డౌన్ కి ముందు శత్రు షర్ట్ లేకుండా రిలీజ్ చేసిన కొన్ని ఫోటోలు చూసి అచ్చు విక్కీ కౌశల్ లా ఉన్నాడు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మొన్నామధ్య వచ్చిన “ఖుషీ” సినిమాలో బ్రాహ్మణ యువకుడిగా నటించి తనలోని నటుడ్ని పరిచయం చేశాడు శత్రు. ఇప్పుడు శత్రు హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. “కర్మణ్యే వాధికారస్తే” అనే సినిమాతో హీరోగా మారాడు శత్రు. ఈ చిత్రం టీజర్ ఇవాళ విడుదలైంది.
అమ్మాయిల హత్యల నేపథ్యంలో సాగే ఈ చిత్రం టీజర్ ఇంట్రెస్టింగ్ గానే ఉంది. అమర్ దీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బ్రహ్మాజీ కీలకపాత్ర పోషిస్తుండగా.. బాలనటుడు మహేంద్రన్ ఆసక్తికరమైన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా విడుదలయ్యాక శత్రుకి హీరోగానూ ఆఫర్లు వస్తే బాగుండు. చిరంజీవి, శ్రీకాంత్ లు కూడా విలన్లుగా కెరీర్ ప్రారంభించి హీరోలు అయినవాళ్లే. మరి ఈ సినిమాతో శత్రు కూడా తనను తాను ప్రూవ్ చేసుకుని హీరోగా ఆఫర్లు దక్కించుకుంటాడేమో చూడాలి.