తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు, టెక్నీషియన్లు చెయ్యాల్సిన సినిమాలు చేతులు మారడం.. లేదా కొందరు కావాలనుకునే మంచి ఆఫర్స్ ని చేజేతులా వదులుకోవడం లాంటివి జరగడం కామన్.. దర్శక నిర్మాతలని మీ సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది అనడిగితే ఏం చెప్తారు?.. ‘‘ఫ్లాప్ అని తెలిస్తే అసలు తీసేవాళ్లమే కాదు కదా’’ అంటారు.. అలాగే అదృష్టం అనేది ఆఫర్ రూపంలో వచ్చినప్పుడు నో చెప్పడం అనేది కూడా తెలియకుండా జరిగేదే..
ఉదాహరణకి తను చేసే ప్రతీ సినిమా స్టోరీని పూరీ జగన్నాథ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి చెప్పడం.. ఆయన నిర్మొహమాటంగా ‘నో’ అనడం.. అవే కథలతో సూపర్ హిట్స్ తీసి మాస్ మహారాజా రవితేజని స్టార్ ని చెయ్యడంలా అన్నమాట.. ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకంటే.. అనుష్క అంటే ‘అరుంధతి’.. జేజమ్మ అంటే అనుష్క అన్నంతగా ఆడియన్స్ మనస్సులో, మెదళ్లలో ముద్రవేసుకున్న ‘అరుంధతి’ సినిమా గురించి.. ఈ సినిమాతో అనుష్క సూపర్ స్టార్ అయ్యింది..
అప్పట్లో ‘ప్రతిఘటన’, ‘కర్తవ్యం’ లాంటి సినిమాలతో విజయ శాంతి ‘లేడీ అమితాబ్’ గా, ‘లేడీ సూపర్ స్టార్’ గా ఎలా మారిందో.. అలా ‘అరుంధతి’ తో అనుష్క కెరీర్ గ్రాఫ్ పెరిగి పోయింది.. లేడీ ఓరియంటెడ్ మూవీస్ కి తను కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయింది.. మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి, కోడి రామకృష్ణ, అనుష్క ఈ సినిమాకి మెయిన్ పిల్లర్స్ గా నిలిచారు. అయితే ‘అరుంధతి‘ కథకు అనుష్క ఫస్ట్ ఛాయిస్ కాదట.. ఆమెకంటే ముందు మలయాళీ భామ మమతా మోహన్ దాస్ ని మెయిన్ లీడ్ గా అనుకున్నారట..
కలిసి కథ చెప్తే.. నో చెప్పిందట.. ఇంత మంచి కథ వద్దంటుంది.. ఈ పిల్లకేమైనా పిచ్చా? అని మనసులో అనుకున్నా కానీ మౌనంగా ఉండిపోయారట మేకర్స్.. అప్పటికి తెలుగులో కొన్ని సినిమాలు చేసినా, హీరోయిన్ గా కాకుండా, లేడీ ఓరియంటెడ్ కథలను సెలెక్ట్ చేసుకునే మెచ్యూరిటీ లేకపోవడం కూడా ఓ కారణమని ఇండస్ట్రీ వారు చెబుతుంటారు..
తర్వాత అనుష్క సీన్ లోకి ఎంటరవడం.. సినిమా సెట్స్ మీదకెళ్లడం.. జేజెమ్మగా, అరుంధతిగా అనుష్క అదిరిపోయే నటన కనబరచడం.. ఆకట్టుకునే కథా, కథనాలకి అద్భుతమైన గ్రాఫిక్స్ యాడవడంతో ఆడియన్స్ కొత్త అనుభూతికి లోనవడం.. వెరసి బొమ్మ బ్లాక్ బస్టర్ అవడం చకచకా జరిగిపోయాయి..